
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా పర్యటనలో భారత సీనియర్ మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. శనివారం అర్జెంటీనా జూనియర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా తరఫున మ్యాచ్ 11వ నిమిషంలో సోల్ పాగెల్లా గోల్ చేయగా... 54వ నిమిషంలో సలీమా (భారత్) దాన్ని సమం చేసింది. అయితే మరో 3 నిమిషాల్లోనే గోల్ సమర్పించుకున్న భారత్ ఓటమి పాలైంది. మ్యాచ్ 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అగస్టినా గోర్జెలానీ నేర్పుగా గోల్ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు 2–2, 1–1తో డ్రాగా ముగిశాయి. తదుపరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.