FIFA WC 2022: క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా

FIFA WC 2022: 2 Argentinian Players Suspended Before Semi Final Match Vs Croatia - Sakshi

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) అన్నంత పని చేసింది. వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో హద్దు మీరి ప్రవర్తించిన అర్జెంటీనా ఆటగాళ్లపై వేటు వేసింది. మార్కోస్‌ అకునా, గొంజాలో మాంటియల్‌పై ఫిఫా ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించింది. ఫిఫా ఇచ్చిన ఈ ఊహించని షాక్‌తో అర్జెంటీనా ఖంగుతింది.

డిసెంబర్‌ 14న క్రొయేషియాతో జరుగబోయే కీలక సెమీస్‌ మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఫిఫా.. అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ జట్టు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, డచ్‌ టీమ్‌తో డిసెంబర్‌ 10న జరిగిన హోరాహోరీ క్వార్టర్స్‌ సమరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఓవరాక్షన్‌ చేయడంతో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 16 సార్లు ఎల్లో కార్డ్ (ఆటగాళ్లకు మందలింపులో భాగంగా ఎల్లో కార్డులను చూపుతారు) చూపించాడు. ఇందులో భాగంగానే ఫిఫా.. ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. 

ఇదిలా ఉంటే, తొలి సెమీఫైనల్లో క్రితం వరల్డ్‌కప్‌ రన్నరప్‌ క్రొయేషియా.. అర్జెంటీనా ఢీకొంటుంటే.. డిసెంబర్‌ 15న జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌.. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో తలపడుతుంది. ఈ రెండు సెమీస్‌లో విన్నర్లు.. డిసెంబర్‌ 18వ తేదీన జరిగే తుది సమరంలో అమీతుమీ తేల్చుకుంటాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top