Trolls On Ishan Kishan: 'మనకి, వాళ్లకి తేడా ఉండాలి కదా.. చిన్నపిల్లాడి మనస్తత్వం!'

Fans Slam Ishan Kishan Hit-Wicket Appeal Tom Latham Its-Child Behaviour - Sakshi

భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.  పరుగుల జడివానలో ఉప్పల్‌ స్టేడియం తడిసి ముద్దయింది. మొదట టీమిండియా నుంచి ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో రెచ్చిపోగా.. ఆ తర్వాత కివీస్‌ బ్యాటర్‌ మైకెల్‌ బ్రాస్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో టీమిండియాకు వణుకు పుట్టించాడు. ఒక దశలో కివీస్‌ను గెలిపించినంత పని చేశాడు. అయితే లోకల్‌ బాయ్‌ సిరాజ్‌ ఆఖర్లో అద్బుత బౌలింగ్‌తో అదరగొట్టి కీలక సమయంలో వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్‌ వేదికగా శనివారం జరగనుంది.

ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో హార్దిక్‌ పాండ్యా ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బంతి తగలకుండానే బెయిల్స్‌ కింద పడడం కనిపించింది. అయితే కీపర్‌ టామ్‌ లాథమ్‌ తన గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను ఎగురగొట్టడం స్పష్టంగా కనిపించినప్పటికి థర్డ్‌ అంపైర్‌ పాండ్యాను ఔట్‌గా ప్రకటించడం దుమారం రేపింది. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యపరిచింది.

దీనికి ప్రధాన కారణమైన కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ మాత్రం క్రీడాస్పూర్తికి విరుద్ధంగా తన తప్పును ఒప్పుకోకుండా అంపైర్‌ నిర్ణయాన్ని సమర్థించడంపై విమర్శలు వచ్చాయి. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ అభిమానులు కామెంట్స్‌ కూడా చేశారు. థర్డ్‌ అంపైర్‌ది చెత్త నిర్ణయం అని.. పాండ్యా నాటౌట్‌ అని కళ్ల ముందు అంత క్లియర్‌గా కనిపిస్తున్నా ఔట్‌ ఇవ్వడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీమిండియా మ్యాచ్‌ గెలవడంతో ఈ వివాదం అంత పెద్దగా మారలేదు.

ఇక న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ తప్పును ఎత్తిచూపిస్తూ టీమిండియా వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ అతని చర్యనే రిపీట్‌ చేశాడు. అదీ కెప్టెన్‌ లాథమ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలోనే. 16వ ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌ వేసిన నాలుగో బంతిని టామ్‌ లాథమ్‌ ఢిపెన్స్‌ ఆడాడు. ఇదే సమయంలో అతని వెనుక బెయిల్స్‌ కిందపడ్డాయి. దీంతో ఇషాన్‌ కిషన్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశాడు. ఇదేంటని లాథమ్‌ ఆశ్చర్యపోయాడు.

హిట్‌ వికెట్‌ అనే సందేహంతో లెగ్‌ అంపైర్‌ రివ్యూకు వెళ్లగా రిప్లేలో అసలు విషయం బయటపడింది. లాథమ్‌ హిట్‌ వికెట్‌ కాలేదు.. కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కావాలనే బెయిల్స్‌ను తన గ్లోవ్స్‌తో తాకించి కిందపడేలా చేశాడు. మొదటిసారి చేస్తే పడలేదని రెండోసారి కాస్త గట్టిగా బెయిల్స్‌ను కదిలించడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో లాథమ్‌ నాటౌట్‌ అని అంపైర్‌ ప్రకటించగానే ఇషాన్‌ కిషన్‌ మొహం నవ్వుతో నిండిపోయింది.

అయితే ఇషాన్‌ కిషన్‌ చర్యపై టీమిండియా మాజీ క్రికెటర్లు సహా అభిమానులు పెదవి విరిచారు. ''మనకి, వాళ్లకు(టీమిండియా, న్యూజిలాండ్‌) తేడా ఉండాలి.. ఇలా క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏంటి.. చిన్నపిల్లాడి మనస్తత్వం వదిలెయ్‌'' ఇషాన్‌ కిషన్‌ అంటూ చివాట్లు పెట్టారు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కూడా ఇషాన్‌ కిషన్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ''ఇషాన్‌ చర్య క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఇది క్రికెట్‌ కాదు'' అంటూ కామెంట్‌ చేశాడు.  

చదవండి: అసలు హార్దిక్‌ పాండ్యాది ఔటేనా!

రాటుదేలుతున్న సిరాజ్‌.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top