రాటుదేలుతున్న సిరాజ్‌.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..!

Team India Pacer Mohammed Siraj Improving His Talent Day By Day - Sakshi

Mohammed Siraj: టీమిండియా స్టార్‌ పేసర్‌, హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇటీవలి కాలంలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా మారిపోయాడనడం అతిశయోక్తి కాదు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా అతని ప్రదర్శనను ఓసారి గమనిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. 2017లో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నాటి నుంచి 2021 ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ వరకు సిరాజ్‌పై పలు అపవాదులు ఉండేవి.

పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, వికెట్లు పడగొట్టలేడు, పవర్‌ ప్లేలో పూర్తిగా చేతులెత్తేస్తాడు, లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మెయింటెయిన్‌ చేయడు.. ఇలా తనలోని లోపాలన్నిటినీ ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు సైతం వేలెత్తి చూపేవారు. దీనికి తోడు నాటి జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మెహర్భానిపై జట్టులో నెట్టుకొస్తున్నాడు అన్న పుకార్లు ఉండేవి.

అయితే గత ఏడాదిన్నర కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిరాజ్‌.. తనలోని లోపాలను అధిగమించి, టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. తనకు మద్దతుగా నిలిచిన కోహ్లిని కాలర్‌ ఎగరేసుకునేలా చేయడంతో పాటు యావత్‌ భారతావని గర్వపడేలా రాటుదేలాడు. టీమిండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా లేని లోటును సైతం పూడుస్తూ, జనాలు పేసు గుర్రాన్ని (బుమ్రా) మరిచిపోయేలా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 

నిన్న తన సొంత మైదానమైన ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ నుంచి.. అంతకుముందు అతనాడిన 10 మ్యాచ్‌లపై ఓ లుక్కేస్తే సిరాజ్‌ ఇటీవలి కాలంలో ఎంతలా రాటుదేలాడో అర్ధమవుతుంది. కివీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్‌.. తన కోటా ఓవర్లు మొత్తం పూరి​చేసి 4 కీలక వికెట్లు పడగొట్టి, టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

అంతకుమందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో 2/30, రెండో వన్డేలో 3/30, మూడో వన్డేలో 4/32.. ఇలా మ్యాచ్‌ మ్యాచ్‌కు తనలోని టాలెంట్‌ను ఇంప్రూవ్‌ చేసుకుంటూ వచ్చాడు. అంతకుమందు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో 4, రెండో టెస్ట్‌లో 2 వికెట్లు.. అదే జట్టుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 3/32, రెండో మ్యాచ్‌లో 2/73, మూడో మ్యాచ్‌లో 1/27 గణాంకాలతో ఈ పర్యటన మొత్తంలో 12 వికెట్లు నేలకూల్చాడు.

బంగ్లా పర్యటనకు ముందు జరిగిన న్యూజిలాండ్‌ పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్‌.. రెండో టీ20లో 2/24, మూడో టీ20లో 4/17 గణాంకాలు నమోదు చేసి పొట్టి ఫార్మాట్‌లోనూ సత్తా చాటాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానం‍లో కొనసాగుతున్న ఈ హైదరాబాదీ పేసర్‌.. టీమిండియా తరఫున 15 టెస్ట్‌ల్లో 46 వికెట్లు, 20 వన్డేల్లో 37 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ల గైర్హాజరీలో భారత పేస్‌ అటాక్‌ను అద్భుతంగా లీడ్‌ చేస్తున్న సిరాజ్‌ మున్ముందు మరింత రాణించాలని ఆశిద్దాం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top