
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్-2025 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఏడాది సీజన్‌లో కార్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ అతడు ప్రస్తుతం పాదం, బొటనవేలు గాయంతో బాధపడుతున్నాడు.
కార్స్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగమయ్యాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కారణంగా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు వైద్యల సలహా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని కార్స్ ధ్రువీకరించాడు.
"భారత్‌తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జరిపాను. వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది ది హండ్రెడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్నప్పటికి నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను.
భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు కూడా కార్స్ దూరమయ్యే అవకాశముంది. అతడు తిరిగి మళ్లీ యాషెస్ సిరీస్‌లో ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే?