T20 WC 2027: జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌ | England name squad 2027 Women's U19 T20 WC Prarthana Reddy In | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌-2027 జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌.. ప్రార్థనా రెడ్డికి చోటు

Sep 25 2026 5:01 PM | Updated on Sep 25 2026 5:22 PM

England name squad 2027 Women's U19 T20 WC Prarthana Reddy In

ప్రార్థనా రెడ్డి (PC: Gloucestershire)

ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌-2027 ఎడిషన్‌కు సంబంధించి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో భారత సంతతికి చెందిన ప్రార్థనా రెడ్డికి కూడా చోటు దక్కింది.

కాగా నేపాల్‌- బంగ్లాదేశ్‌ వేదికలుగా 2027లో అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జనవరి- ఫిబ్రవరి మధ్య నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ బోర్డు దాదాపు నాలుగున్నర నెలల ముందుగానే తమ జట్టును ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

పాఠాలు నేర్చుకున్నాము
ఈ సందర్భంగా హెడ్‌కోచ్‌ క్రిస్‌ గెస్ట్‌ మాట్లాడుతూ.. ‘‘అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ టోర్నీకి మేము అత్యుత్తమ జట్టును ఎంపిక చేశాము. టైటిల్‌ గెలవడమే మా లక్ష్యం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాము.

ఈసారి మా ప్రణాళిక కాస్త భిన్నంగా ఉండబోతోంది. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి.. వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేయాలని చూస్తున్నాము’’ అని పేర్కొన్నారు. నవంబరు- డిసెంబరులో భారత అండర్‌-19 మహిళల జట్టుతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తమకు చక్కటి సన్నాహకంగా ఉపయోగపడుతుందన్నారు.

భారత్‌తో టీ20 సిరీస్‌
భారత్‌తో టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత కూడా వారం రోజుల పాటు అక్కడే ఉండి ప్రాక్టీస్‌ కొనసాగిస్తామని గెస్ట్‌ తెలిపారు. కాగా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టే భారత్‌తో సిరీస్‌లోనూ ఆడబోతోంది. ఇదిలా ఉంటే.. 2023లో అరంగేట్ర ప్రపంచకప్‌ సీజన్‌లో ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌.. 2025లో అత్యుత్తమంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2027కి ఇంగ్లండ్‌ జట్టు
మారియా ఆండ్రూస్‌, అమెలీ బిషప్‌, ఫోబే బ్రెట్‌, ఎలిజా బ్రిస్టోవ్‌, ఫ్లోరా డేవిస్‌, హాలీ గార్టన్‌, బ్రియోని గిల్‌గ్రాస్‌, జెనెవీవ్‌ జీర్‌, అమెలియా ఒలివర్‌, శ్రిష్టి పాటిల్‌ (భారత సంతతి), ప్రార్థనా రెడ్డి (భారత సంతతి), ఫైత్‌ టీకాసింగ్‌, క్లారా ఠాకర్‌, స్కై థామస్‌, వీనస్‌ వీరప్పులి (శ్రీలంక సంతతి).

ఎవరీ ప్రార్థనా రెడ్డి?
బ్రిస్టల్‌కు చెందిన ప్రార్థనా రెడ్డి 2008, జనవరి 31న జన్మించింది. ఈమె రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌.. అదే విధంగా కుడిచేతి వాటం గల టాపార్డర్‌ బ్యాటర్‌. గ్లౌసెస్టర్‌షైర్‌ సీసీసీ తరఫున 2023లో ఎంట్రీ ఇచ్చిన ప్రార్థనా.. 2024 తర్వాత గ్లామోర్గాన్‌ తరఫున టైర్‌ 2 క్రికెట్‌లో అడుగుపెట్టింది. అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్‌ మీద 91 పరుగులు చేసి ఆకట్టుకుంది. తాజాగా ఇంగ్లండ్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించింది. 

చదవండి: తొలి టెస్టులో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement