టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్‌ జట్టుకు మరో షాక్‌ | England Fined For Slow Over Rate During 1st WT20I Versus India | Sakshi
Sakshi News home page

టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్‌ జట్టుకు మరో షాక్‌

Jun 29 2025 8:38 PM | Updated on Jun 29 2025 8:38 PM

England Fined For Slow Over Rate During 1st WT20I Versus India

నాటింగ్హమ్‌ వేదికగా నిన్న (జూన్‌ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్‌ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. 

ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మంధన కేవ‌లం 51 బంతుల్లోనే సెంచ‌రీ మార్క్‌ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్‌ సెంచరీని, భారత్‌ తరఫున రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీని (హర్మన్‌-49 బంతుల్లో) నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. భార‌త బౌల‌ర్ల ధాటికి కేవ‌లం 113 ప‌రుగులకే ఆలౌటైంది. 

భార‌త బౌల‌ర్ల‌లో క‌డ‌ప‌ అమ్మాయి శ్రీచ‌ర‌ణీ నాలుగు వికెట్లతో స‌త్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెం‍డు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్‌(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్‌
ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్‌ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను జరిమానాగా విధించింది. 

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్‌ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ స్వీకరించింది. ఇంగ్లండ్‌ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.

కాగా, ఇంగ్లండ్‌ మహిళల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్‌పై 200 ప్లస్‌ స్కోర్‌ చేసిన రెండో జట్టుగా భారత్‌ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్‌ వేదికగా జులై 1న జరుగనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement