
బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
హీథర్ నైట్ కీలక ఇన్నింగ్స్
చార్లీ డీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
మహిళల వన్డే ప్రపంచకప్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్‌లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు.
బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్‌తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచింది.
వన్‌డౌన్‌లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్‌కు డీన్‌తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆ్రస్టేలియా తలపడనుంది.