
ఎడ్జ్‌బాస్టన్ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్ ఫీల్డ్‌ను వేగంగా డ్రై చేశారు. సూర్యుడు మేఘాలను ముసుగు నుంచి బయటికి వచ్చాడు.
అయితే ఓవర్ల కోత మాత్రం తప్పలేదు. ఇవాల్టి ఆటలో 90 కాకుండా 80 ఓవర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా 10 ఓవర్ల కోత పడింది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. దాదాపు 2 గంటలు ఆలస్యంగా భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యింది.
సవరించిన సెషన్ టైమింగ్స్‌ను కూడా అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్ 5:10 నుంచి 7 గంటల వరకు.. రెండో సెషన్ 7:40 నుంచి 9:40 వరకు.. మూడో సెషన్ రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్.. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (162 బాల్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.
స్కోర్ వివరాలు..
భారత్ 587 & 427/6 డిక్లేర్
ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్‌రేట్: 4.5