‘హెచ్‌సీఏ’ కమిటీపై ఉత్తర్వులు ఇవ్వవద్దు 

Do not pass orders on the HCA committee - Sakshi

తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న జస్టిస్‌ (రిటైర్డ్‌) ఎల్‌.నాగేశ్వరరావు కమిటీకి సంబంధించి దిగువ కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏ కమిటీ రద్దయిన నేపథ్యంలో అసోసియేషన్‌ కార్యకలాపాలను చక్కదిద్దేందుకు గత ఫిబ్రవరిలో ఎల్‌. నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

అయితే హెచ్‌సీఏ ఎన్నికల అంశం వ్యవహారం సహా ఇతర అంశాల్లో పలువురు హెచ్‌సీఏ సభ్యులు పదే పదే వేర్వేరు కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీరి పిటిషన్‌ల తర్వాత హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.

హెచ్‌సీఏ ప్రస్తుత స్థితికి సంబంధించి సుప్రీంకోర్టులోనే పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై తీర్పు ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. అసలు అలాంటి పిటిషన్‌లను అనుమతించడమే తప్పని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన చెల్లవని కూడా స్పష్టం చేసిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను అక్టోబర్‌ 31కి వాయిదా వేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top