గొయెంకాపై తప్పుడు పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు | Delhi High Court Grants Sanjiv Goenka Personality Rights Protection | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Apr 25 2026 2:05 PM | Updated on Apr 25 2026 2:25 PM

Delhi High Court Grants Sanjiv Goenka Personality Rights Protection

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు యజమాని అయిన సంజీవ్‌ గొయెంకా విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడుతూ అవమానకరమైన పోస్టులు, వీడియోలు రూపొందిస్తున్నారని గొయెంకా ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన ముఖాన్ని ఇతరుల శరీరాలకు జతచేసి, హింసాత్మక లేదా అనుచిత దృశ్యాల్లో చూపిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గొయెంకాకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పించింది. ఐపీఎల్‌ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.

గొయెంకా తరఫున సీనియర్‌ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. "ఇది సరదా కాదు, వ్యంగ్యం కాదు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం" అని కోర్టుకు తెలిపారు. ఇటువంటి కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.

కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజా ప్రముఖులు విమర్శలను, వ్యంగ్యాన్ని భరించాల్సి ఉంటుందని పేర్కొంటూనే.. డిజిటల్ మార్ఫింగ్, డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు కథనాలు సృష్టించడం మాత్రం అనుమతించలేమని స్పష్టం చేసింది.

ప్రత్యేకంగా గొయెంకాపై ఐపీఎల్ నేపథ్యంలో వైరల్ అవుతున్న కంటెంట్ హద్దులు దాటిందని కోర్టు అభిప్రాయపడింది. వ్యంగ్యానికి, అవమానానికి మధ్య స్పష్టమైన రేఖ ఉందని తెలిపింది.

ఈ ఉత్తర్వులతో గోయెంకా పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని వక్రీకరించి ప్రచారం చేసే కంటెంట్‌ను తొలగించేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement