11 ఏళ్ల క్రితం ఈ రోజు శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ఏం చేశాడో గుర్తుందా..? 

On This Day In 2010: Legendary Spinner Muttiah Muralitharan Scripted History By Taking 800th Test Wicket - Sakshi

కొలంబో: సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు నేలకూల్చిన తొలి క్రికెటర్‌గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. రోజుకో రికార్డు బద్దలవుతున్నా నేటి క్రికెట్‌లో 11 ఏళ్ల క్రితం మురళీ నెలకొల్పిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. బహుశా భవిష్యత్తులో ఏ క్రికెటర్‌ కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి చేరేలా కనిపించడం లేదు. 

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గాలేలో 2010 జులై 22న భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో మురళీధరన్ 800 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మురళీ.. ఈ మైలురాయిని చేరుకునేందుకు మరో వికెట్ అవసరమైంది. అయితే, అప్పటికే భారత్‌ రెండో ఇన్సింగ్స్‌లో 9 వికెట్లు చేజార్చుకుంది. దీంతో మురళీ 800 వికెట్లు మైలురాయిని చేరుకుంటాడా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగింది. ఎందుకంటే ఈ టెస్టు ప్రారంభానికి ముందే మురళీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

తొలి టెస్టు తర్వాత తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడంతో 800 వికెట్ దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్ క్రీడాభిమానుల్లో మొదలైంది. అయితే, చివరికి ఆ సమయం రానే వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝాకు ఆఫ్ స్టంప్‌ ఆవల సంధించిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి జయవర్థనే చేతుల్లో పడడంతో స్టేడియం మార్మోగిపోయింది. బాణాసంచా మోతెక్కింది. ఆనందాన్ని పట్టలేని మురళీ మైదానంలో గెంతులేశాడు. సహచరులంతా ఈ సందర్భాన్ని మరపురాని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, మురళీధరన్ తన టెస్ట్ కెరీర్‌ మొత్తంలో 113 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 800 వికెట్లు పడగొట్డాడు. మురళీధరన్ ఆడిన చివరి టెస్ట్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top