
శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (PC: SLC)
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్‌లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది.
వేటు తప్పదంటూ వార్తలు
ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ...
సెలక్టర్ల నిర్ణయం ఇదే
‘‘వరల్డ్‌కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్‌గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్‌వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు.
మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే
టీమిండియాతో ఫైనల్‌కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్‌గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు.
కాగా కెప్టెన్‌గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..