Novak Djokovic: శోకోవిచ్‌... వరల్డ్‌ నంబర్‌వన్‌ కల చెదిరె

Daniil Medvedev ends Novak Djokovic bid for year Slam at US Open - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

ఫైనల్లో జొకోవిచ్‌పై ఘన విజయం

తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించిన రష్యన్‌

రూ. 18 కోట్ల 37 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

అవును... జొకోవిచ్‌ ఓడిపోయాడు! అరుదైన ఫామ్‌తో, ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శనతో ఆడుతూ వచ్చిన వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆఖరి మెట్టుపై అయ్యో అనిపించాడు! మెల్‌బోర్న్, పారిస్, లండన్‌ సమరాలను దిగ్విజయంగా దాటిన సెర్బియా స్టార్‌కు న్యూయార్క్‌ మాత్రం అనూహ్యంగా నిరాశను మిగిల్చింది. 1969 తర్వాత ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అత్యంత అరుదైన ఘనత సాధించే, ఇరవై ఒకటవ ‘మేజర్‌’ టైటిల్‌తో అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ముంగిట బరిలోకి దిగిన జొకో చివరకు ఓటమితో కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించాడు.  

జొకోవిచ్‌తో తలపడటం, అదీ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అంటే ఓటమికి సిద్ధం కావడమే అనే స్థితి కనిపిస్తున్న దశలో రష్యన్‌ ఆటగాడు మెద్వెదెవ్‌ పెను సంచలనంతో సత్తా చాటాడు. మైదానం మొత్తం ప్రత్యర్థికి అనుకూలంగా హోరెత్తుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఆడిన అతను కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో చిరునవ్వులు చిందించాడు.

ఫైనల్‌ ఫలితం ఎలా ఉన్నా... చివరి వరకు పోరాడుతానని మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన మెద్వెదెవ్‌ అంతకు మించిన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో జొకోవిచ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్‌కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్‌ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

న్యూయార్క్‌: 2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ గెలిచి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరే వరకు 27–0 మ్యాచ్‌ల విజయాలతో జోరు ప్రదర్శించిన వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు భంగపాటు ఎదురైంది. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను 1969 తర్వాత ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు.

భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. 2 గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్, ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మెద్వెదెవ్‌ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్‌... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేర్చుకున్నాడు. .  

మెద్వెదెవ్‌ జోరు...
గతంలో జొకోవిచ్‌తో తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లలోనూ ఓడిన మెద్వెదెవ్‌ ఈసారి పూర్తి స్థాయి సన్నద్ధతతో వచ్చాడు. తొలి సెట్‌లో 8 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్‌ ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా ఇవ్వలేదు. రెండో సెట్‌లో జొకో పోటీనిచ్చే ప్రయత్నం చేసినా... తొలి రెండు గేమ్‌లలో 5 బ్రేక్‌ పాయింట్లు కాపాడుకున్న రష్యన్, ప్రత్యర్థి సరీ్వస్‌ను బ్రేక్‌ చేసి ముందంజ వేయగలిగాడు. మూడో సెట్‌లోనూ ఇదే జోరు చూపించిన అతను డబుల్‌ బ్రేక్‌ పాయింట్లతో దూసుకుపోయాడు.

జొకో కొత్త చరిత్రను చూసేందుకు తరలివచ్చిన దిగ్గజ ఆటగాళ్లు, హాలీవుడ్‌ స్టార్లూ మెద్వెదెవ్‌ ఆటతో ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌ చివర్లో స్టేడియంలోని అభిమానులంతా మెద్వెదెవ్‌ను గేలి చేయడం మొదలు పెట్టారంటే వారి దృష్టిలో ఈ ఫలితం ఎంత అనూహ్యమైందో అర్థం చేసుకోవచ్చు. మూడో సెట్‌లో 5–2 వద్ద డబుల్‌ ఫాల్ట్‌ చేసినా... చివరకు పదో గేమ్‌లో సరీ్వస్‌ నిలబెట్టుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తమ పెళ్లి రోజున తొలి గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన క్షణాన మెద్వెదెవ్‌... ‘డెడ్‌ ఫిష్‌’ సంబరాన్ని ప్రదర్శించాడు.

జొకో అసహనం...
మ్యాచ్‌లో కొన్ని కీలక సమయాల్లో లభించిన అవకాశాలను జొకోవిచ్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో సెట్‌లో రెండు సార్లు మెద్వెదెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసే అవకాశం వచి్చనా అది చేజారింది. ఒక దశలో 40–0తో ముందంజలో ఉన్నా చివరకు గేమ్‌ దక్కలేదు. దాంతో తీవ్ర అసహనంతో తన రాకెట్‌ను మూడు సార్లు నేలకేసి విరగ్గొట్టిన అతను అంపైర్‌ హెచ్చరికకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్లీ కోలుకోలేకపోయాడు. ఈ టోర్నీ మూడో రౌండ్‌ నుంచి సెమీస్‌ వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ జొకో తొలి సెట్‌ కోల్పోయాడు. ఫైనల్లోనూ అలాగే జరుగుతుందని అంతా ఆశించినా రష్యన్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి చేంజ్‌ ఓవర్‌ సమయంలో జొకో టవల్‌ మధ్యలో మొహం దాచుకొని ఏడ్చేశాడు!

జొకో, అతని అభిమానులకు నా క్షమాపణలు. అతను గెలిస్తే ఏం జరిగేదో అందరికీ తెలుసు. నా కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ అయినా గెలవగలనా అనుకునేవాడిని. గెలవకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూనే ఉండాలనుకున్నా. ఇప్పుడు తొలి ‘గ్రాండ్‌’ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మరొకటి గెలిచినా ఇంతగా స్పందిస్తానో లేదు తెలీదు. జొకో ప్రతీ మ్యాచ్‌కు వ్యూహం మారుస్తాడు. అన్నింటికీ సన్నద్ధమై వచ్చా. పెళ్లి రోజు నా శ్రీమతికి ఈ టైటిల్‌ను బహుమతిగా ఇచ్చా.  
–మెద్వెదెవ్‌
 
ఈ రోజు గెలవకపోయినా మీ అభిమానం చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా గుండెను తడిమిన మీ ఆదరణ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తిని నేనే అనిపిస్తోంది. అద్భుతంగా ఆడిన మెద్వెదెవ్‌కే గెలిచే అర్హత ఉంది. ఫలితం నిరాశ కలిగించినా... ఇన్ని రోజులుగా రికార్డు వేటలో నాపై ఉన్న తీవ్ర మానసిక ఒత్తిడి, అంచనాల భారం తొలగిపోయినందుకు ప్రశాంతంగా అనిపిస్తోంది.  
–జొకోవిచ్‌

► రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన మూడో ఆటగాడు మెద్వెదెవ్‌. గతంలో కఫెలి్నకోవ్‌ (1996 ఫ్రెంచ్‌ ఓపెన్, 1999 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌), మరాత్‌ సఫిన్‌ (2000 యూఎస్‌ ఓపెన్, 2005 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) రెండేసి ట్రోఫీలు గెలిచారు.

► ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో కొత్త చాంపియన్స్‌ అవతరించడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గాస్టన్‌ గాడియో (అర్జెంటీనా), అనస్తాసియా మిస్కినా (రష్యా) తొలిసారి ‘గ్రాండ్‌’ విజేతలుగా నిలిచారు.

► ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్‌) టైటిల్స్‌ గెలిచి చివరిదైన యూఎస్‌ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్‌ జొకోవిచ్‌. గతంలో జాక్‌ క్రాఫోర్డ్‌ (1933లో), లె హోడ్‌ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది.

► జొకోవిచ్‌ కెరీర్‌లో 11సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఫెడరర్‌ (11), ఇవాన్‌ లెండిల్‌ (11) సరసన జొకోవిచ్‌ కూడా చేరాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top