ఇక ఆసీస్‌తో ప్రమాదం | Danger with the Aussies says Krishnamachari Srikanth | Sakshi
Sakshi News home page

ఇక ఆసీస్‌తో ప్రమాదం

Oct 20 2023 3:37 AM | Updated on Oct 20 2023 3:37 AM

Danger with the Aussies says Krishnamachari Srikanth - Sakshi

వరుస పరాజయాల అనంతరం ఆ్రస్టేలియా జట్టు ఎట్టకేలకు శ్రీలంకపై చక్కని విజయంతో ప్రపంచకప్‌లో బోణీ చేసింది. పట్టికలో చేరిన 2 పాయింట్లు ఆసీస్‌ శిబిరాన్ని సంబరంలో ముంచింది. ఓ కెప్టెన్ ముందుండి నడిపిస్తే దాని ప్రభావం జట్టుపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం రోహిత్‌ శర్మ భారత్‌ను ఎలా విజయవంతగా నడిపిస్తున్నాడో చూస్తే అర్థమవుతుంది. ఆసీస్‌ కెప్టెన్ కమిన్స్‌ లయ అందుకోవడం, స్పిన్నర్‌ జంపా తిప్పేయడంతో ‘కంగారూ జట్టు’ ఇకపై ప్రమాదకర శక్తిగా మారుతుంది. ఇదే విషయం వారి గత ఐదు ప్రపంచకప్‌ టైటిళ్ల ఘనమైన రికార్డు సూచిస్తుంది.

మార్ష్ , లబుషేన్‌లతో పాటు స్మిత్‌ కూడా నిలకడగా ఆడితే బ్యాటింగ్‌ దళానికి తిరుగుండదు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు అఫ్గాన్, దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ ఊహించని షాక్‌లు ఇచ్చాయి. ఇలా రోజుల వ్యవధిలోనే రెండు సంచలనాలు సెమీఫైనల్‌ బెర్త్‌ల రేసును రసవత్తరం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై ఆఖరి పది ఓవర్లలో డచ్‌ బ్యాటర్లు చెలరేగిన వైనం, బౌలింగ్‌లో సఫారీపై విసిరిన పంజా అద్భుతం.

ఇలాంటి పరాజయం నుంచి దక్షిణాఫ్రికా ఎలా పుంజుకుంటుందో చూడాలి. నేడు ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరగడం ఖాయం. ఎందుకంటే రెండు మ్యాచ్‌లు ఓడిన ఆసీస్‌ గెలుపుబాట పట్టగా, రెండు విజయాలు సాధించిన పాక్‌ ఓటమితో ఉంది. ఇలాంటి జట్ల మధ్య శుక్రవారం ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. యువ బ్యాటర్లు షఫిక్, ఇమాముల్, షకీల్‌లతో పాటు సీనియర్లు బాబర్‌ ఆజమ్, రిజ్వాన్‌లు బ్యాట్‌ ఝుళిపిస్తే విజయం ఏమంత కష్టం కాదు.

ఇక వేదిక గురించి చెప్పుకోవాల్సి వస్తే... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఖాయం. ఇది ఎన్నోసార్లు పరుగుల మజా పంచింది. అలాగే నాణ్యమైన బౌలింగ్‌ రుచి చూపిస్తే... కట్టడి చేయొచ్చని కూడా ఐపీఎల్‌లో యజువేంద్ర చహల్‌ నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఎవరు మెరిపిస్తారో, ఎవరు కట్టడి చేస్తారో చూడాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement