పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. పసికూన చేతిలో ఓటమి | Sakshi
Sakshi News home page

CWG 2022: పాక్‌కు పరాభవం.. కరీబియన్‌ జట్టు చేతిలో ఓటమి

Published Sat, Jul 30 2022 3:26 PM

CWG 2022: Barbados Enrolls Thrilling Victory Over Pakistan - Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం  తెలిసిందే. మెగా ఈవెంట్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 29) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ చేతిలో ఓటమిపాలవ్వగా.. రెండో మ్యా్చ్‌లో కరీబియస్‌ జట్టైన బార్బడోస్‌ చేతిలో పాక్‌కు పరాభవం ఎదురైంది. హర్మన్‌ సేనను ఆసీస్‌ 3 వికెట్ల తేడా ఓడించగా.. పసికూన బార్బడోస్‌ 15 పరుగుల తేడాతో పాక్‌ను ఖంగుతినిపించింది. 

పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. వికెట్‌కీపర్‌ కైసియా నైట్ (56 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు), కెప్టెన్‌ హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీలతో రాణించడం‍తో బార్బడోస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. 

పాక్‌ బౌలర్లలో ఫాతిమా సనాకు 2 వికెట్లు దక్కగా.. డయానా బేగ్‌ ఓ వికెట్‌ పడగొట్టింది. అనంతరం ఛేదనలో పాక్ తడబాటుకు లోనై 129 పరుగులకే (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. నిదా దార్ (31 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) పాక్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. నిదాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో పాక్‌ ఓటమిపాలైంది. నిదా మినహా మరే ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. 

బార్బడోస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ పొదుపుగా బౌలింగ్‌ (4 ఓవర్లలో 1/13) చేయడంతో పాటు రెండు రనౌట్లు చేసి ఓ క్యాచ్‌ అందుకోగా.. షమీలియా కాన్నెల్‌, ఆలియా అల్లెన్‌, డియాండ్రా డొట్టిన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, గ్రూప్‌-బి మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా.. రాత్రి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. జులై 31న (ఆదివారం) గ్రూప్‌-ఏకి సంబంధించిన కీలక మ్యాచ్‌లో భారత్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 
చదవండి: CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్‌ బ్యాటర్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement