
టీమిండియా స్పిన్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం రవి చంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని అశ్విన్ వెల్లడించాడు.
"నా కెరీర్‌లో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఐపీఎల్ క్రికెటర్‌గా నా ప్రయాణ ఈ రోజుతో ముగిసింది. కానీ ప్రతీ ముగింపునకు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఇకపై వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు నా అన్వేషణను మొదలు పెట్టనున్నాను.
ఈ 16 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు సపోర్ట్‌గా నిలిచిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని తన రిటైర్మెంట్ నోట్‌లో అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొన్నాడు.
2009లో సీఎస్‌కే తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనకంటూ ఓ పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 పరుగులు సాధించాడు.
38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముందు వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో అశ్విన్ భాగంగా ఉన్నాడు.
అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అశూను రాజస్తాన్ విడిచిపెట్టడంతో రూ. 9.75 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అశ్విన్‌ను సీఎస్‌కే విడిచిపెట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి.
అంతలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అశ్విన్ ఇక బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడే అవకాశముంది. కాగా భారత ఆటగాడు విదేశీ లీగ్స్‌లో ఆడాలటే భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలి.
చదవండి: విజయ్ శంకర్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల బంధానికి ముగింపు?