‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ | CSK Captain Ruturaj Gaikwad Says Not So Frustrated Match Lost Vs RR | Sakshi
Sakshi News home page

Ruturaj Gaikwad: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’

Mar 31 2026 9:22 AM | Updated on Mar 31 2026 12:31 PM

CSK Captain Ruturaj Gaikwad Says Not So Frustrated Match Lost Vs RR

ఐపీఎల్ 19వ సీజన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో  సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్ ఓటమి మాకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్‌ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. 

మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్ ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్‌, నండ్రీ బర్గర్‌లను ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. నిజానికి రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. 

ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. కానీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసినట్లయితే 150 నుంచి 160 స్కోరు చేసేవాళ్లం. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫ‌లితంపై పెద్దగా నిరాశ చెంద‌డం లేదు.  ఈ మ్యాచ్ గురించి ఇక్క‌డే మ‌రిచిపోయి ముందుకు సాగుతాము. 

మ‌రో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉంద‌ని, దీంతో జట్టులో అంద‌రూ సానుకూల దృక్ప‌థంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జ‌ట్టులో ఎక్కువ మంది యువ ఆట‌గాళ్లు ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. 

అయితే సీఎస్‌కే భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్‌, శివమ్ దూబే పూర్తిగా విఫలం కావడం, గాయాలతో ధోని, డెవాల్డ్ బ్రెవిస్ దూరం కావడం కూడా సీఎస్‌కేను ఒత్తిడిలోకి నెట్టేసింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో న‌లుగురికి చెక్‌!

Advertisement
 
Advertisement
Advertisement