కప్‌ గెలవకపోయినా... ప్రపంచాన్ని గెలిచాడు | Cristiano Ronaldos World Cup career is over | Sakshi
Sakshi News home page

కప్‌ గెలవకపోయినా... ప్రపంచాన్ని గెలిచాడు

Jul 8 2026 2:27 AM | Updated on Jul 8 2026 2:28 AM

Cristiano Ronaldos World Cup career is over

అసాధారణం క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌

అవరోధాలను దాటి అగ్రస్థాయికి

ముగిసిన ప్రపంచకప్‌ ప్రస్థానం  

ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్‌ డియోర్‌ అవార్డు...  ఐదుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా ‘ఫిఫా’ ఎంపిక... 
యూరోపియన్‌ యూనియన్‌ అత్యుత్తమ ఆటగాడిగా మూడుసార్లు ఘనత... నాలుగుసార్లు యూరోపియన్‌ యూనియన్‌ ‘గోల్డెన్‌షూ’ విజేత... చాంపియన్స్‌ లీగ్, నేషన్స్‌ లీగ్, యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 35 ట్రోఫీ విజయాల్లో సభ్యుడిగా అసాధారణ రికార్డు...ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్‌...మొత్తంగా ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌లో 1300కు పైగా మ్యాచ్‌లు... దాదాపు 1000 గోల్స్‌... ఇంతటి అత్యద్భుత కెరీర్‌ అతని సొంతం!

అయితే ఇన్ని సాధించినా ఆ ఒక్కటి మాత్రం అతనికి దక్కలేదు.చివరకు వరల్డ్‌కప్‌ మాత్రం లేకుండానే క్రిస్టియానో రొనాల్డో  నిష్క్రమించాల్సి వచ్చింది. అయితేనేమి... ప్రపంచకప్‌ గెలవలేకపోయినా క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఏమాత్రం తగ్గదు. వరల్డ్‌కప్‌ విజయంలో భాగం కాలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అతని ఆటతో ఉర్రూతలూగిపోయిన మైదానాలు రొనాల్డో స్థాయిని చూపించాయి. ఆటపై అతను వేసిన ముద్ర అభిమానుల మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. – సాక్షి క్రీడా విభాగం  

ఫుట్‌బాలర్‌ కాకపోయి ఉంటే నా కొడుకు ఇటుకలు మోసేవాడు, తాపీ మేస్త్రీ పని చేసేవాడు... రొనాల్డో గురించి అతని తల్లి చెప్పిన మాట ఇది. నిజంగానే అతని నేపథ్యం అలాంటిది. పేరుకే సైనికుడు అయిన అతని తండ్రి తాగుబోతుగా మారి.. రొనాల్డో పుట్టే సమయానికే ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత స్థానికంగా ఒక గార్డెన్‌లో పని చేసినా ఆదాయం చాలా స్వల్పం. దాంతో తల్లి వేర్వేరు ఇళ్లల్లో, హోటల్‌లలో పని మనిషిగా చేస్తూ ఇంటిని నడపాల్సి వచ్చింది. అప్పటికే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్న తల్లి ఈ పేదరికం కారణంగానే తన నాలుగో గర్భాన్ని తొలగించుకోవాలని చూసింది. 

అయితే ప్రమాదం అంటూ డాక్టర్లు తిరస్కరించడంతో వెనకడుగు వేసింది. కానీ ఆ పుట్టే నాలుగోవాడు చరిత్ర సృష్టిస్తాడని, ప్రపంచ క్రీడారంగంలోనే శిఖరానికి చేరతాడని ఆమె ఊహించలేదు. మొదటి నుంచీ రొనాల్డోకు చదువు అబ్బలేదు. ఒకసారి స్కూల్‌లో టీచర్‌పై కుర్చీ కూడా విసరడంతో అతడిని బయటకు పంపించారు. అంతే ఆరో తరగతితోనే చదువు ముగిసిపోయింది. అయితేనేమి ఫుట్‌బాల్‌లో మాత్రం అతను రారాజుగా వెలిగాడు.

తాను ప్రాణంగా, పిచ్చిగా ప్రేమించిన ఫుట్‌బాల్‌లో మాత్రం అతను కఠోర శ్రమకు వెనుకాడలేదు. ప్రాణం పెట్టి పట్టుదలగా ఆడటమే  రొనాల్డోను చాంపియన్‌ ప్లేయర్‌గా మార్చింది. అతను బాగా పేరు సంపాదించుకున్న తర్వాత పోర్చుగల్‌లో మ్యాగీలాంటి కంపెనీలు, సూపర్‌ మార్కెట్‌లకు అతని తల్లి ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. అయితే రొనాల్డోకు 20 ఏళ్ల వయసులో ఇంకా స్టార్‌ కాకముందే మద్యం కారణంగా వచ్చిన అనారోగ్యంతో అతని తండ్రి చనిపోయాడు. 

అసాధారణ ప్రతిభతో... 
ఏడేళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో ఆట మొదలైంది. ఆ వయసులోనే స్థానిక క్లబ్‌ ఆండోరిన్హాకు అతను ఆడటం మొదలు పెట్టాడు. అక్కడే అతనిలో అపార ప్రతిభ ఉందని గుర్తించిన కోచ్‌లు ప్రోత్సహించారు. చదువు అబ్బదని తెలిసిన క్షణాన పూర్తి సమయం ఆటకే కేటాయిస్తే అద్భుతాలు సాధ్యమని కోచ్‌ ఇచ్చిన సలహాతో రొనాల్డో తల్లి ఏకీభవించడంతో అతనికి మరో లోకం లేకుండా పోయింది. ఫుట్‌బాల్, ఫుట్‌బాల్‌... ఎప్పుడు చూసినా గ్రౌండ్‌లోనే... ఎక్కడైనా అదే ధ్యాస. అప్పటికే బ్రెజిల్‌ దిగ్గజాలు రొనాల్డో నజారియో, రొనాల్డిన్హోలను అభిమానించడం మొదలు పెట్టిన ఈ కుర్రాడు ఒక్కసారిగా దూసుకుపోయాడు. 

తన ఆటతో ప్రమోషన్‌ సాధిస్తూ జూనియర్‌ ఆటగాడిగా పదేళ్లపాటు మూడు వేర్వేరు క్లబ్‌లకు ఆడి రొనాల్డో తన విలువేంటో చూపించాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో సీనియర్‌ ఆటగాడిగా తొలిసారి లిస్బన్‌లో స్పోర్టింగ్‌ క్లబ్‌ పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడితో మొదలైన అతడి ప్రస్థానం ఆ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించే స్థాయికి తీసుకెళ్లింది. గత 24 ఏళ్లుగా రొనాల్డో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.

అరుదైన వ్యాధిని దాటి... 
మైదానంలో చిరుతలా ఇప్పుడు దూసుకుపోతున్న రొనాల్డో ఫుట్‌బాల్‌ ప్రపంచం చిన్నప్పుడే ముగిసిపోయేది. అతను నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకునే అరుదైన వ్యాధి టాకీకార్డియా బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతను బతికిపోయాడు. గుండెకు ప్రత్యేక శస్త్రచికిత్స జరిపిన తర్వాత అతను కోలుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మళ్లీ ఫుట్‌బాల్‌ మైదానంలోకి వచ్చి తన ఆటను చూపించడం విశేషం.  

పోర్చుగల్‌ను గెలిపించి...
జాతీయ జట్టు తరఫున రొనాల్డో వరల్డ్‌ కప్‌ గెలవకపోయినా... ఈ టోర్నీలో అతని ప్రభావం తక్కువగా కనిపించినా.. 23 ఏళ్లుగా పోర్చుగల్‌ సీనియర్‌ టీమ్‌కు స్టార్‌ అట్రాక్షన్‌ అతడే. ఫలితాలు ఎలా వచ్చినా అతని చుట్టే టీమ్‌ భ్రమించింది. రొనాల్డోను మినహాయిస్తే మరో ఆటగాడి గురించి ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులు ఆలోచించలేని పరిస్థితి ఉంది. క్లబ్‌ ఫుట్‌బాల్‌లో చూపిన అద్భుత ప్రదర్శనలు ఇక్కడ పునరావృతం చేయలేదనే విమర్శలు వచ్చినా... సహచరుల అండ లేకుండా ఒంటి కాలితో అతను అందించిన విజయాలు ఎన్నో. 

అసలు రొనాల్డో వల్లనే పోర్చుగల్‌ టీమ్‌ గెలవాలని కోరుకునే అభిమానులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 233 మ్యాచ్‌లలో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 2016 యూరోలో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. రెండుసార్లు అతని సారథ్యంలోనే టీమ్‌ నేషన్స్‌ లీగ్‌ విజేతగా నిలిచింది. 2006 నుంచి 2026 వరకు ఆరు వరల్డ్‌ కప్‌లు ఆడిన రొనాల్డో 27 మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్‌ కొట్టాడు. 2006లో టీమ్‌ అత్యుత్తమంగా సెమీఫైనల్‌ చేరింది.

ఈతరం ఆటగాళ్ళలో అర్జెంటీనా స్టార్‌ మెస్సీతో ఇన్నేళ్లుగా అతడిని పోల్చడం రివాజుగా మారిపోయింది. ఇతర ఘనతలను పక్కన పెడితే  2022లో వరల్డ్‌ కప్‌ గెలవడంతో రొనాల్డో కంటే మెస్సీ ఒక మెట్టు పైకి కనిపిస్తున్నా... ప్రజాదరణ, ఆటపరంగా రొనాల్డో ఎవరికంటే తక్కువ కాదు. వ్యక్తిగత ఘనతలు, సాధించిన రికార్డులు, రివార్డులు చూస్తే అతని స్థాయి కూడా శిఖరాన ఉందంటే అతిశయోక్తి లేదు.

క్లబ్‌లతో కనకాభిషేకం... 
18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో రొనాల్డో జత కట్టడంతో అతని కెరీర్‌ మలుపు తిరిగింది. ఈ క్లబ్‌కు ఆరేళ్లు, ఆ తర్వాత రియల్‌ మాడ్రిడ్‌తో తొమ్మిదేళ్లు అతని ఆటలో అత్యుత్తమ స్థాయిని చూపించాయి. బంతి డ్రిబ్లింగ్‌తో మొదలు పెడితే ఎదురు లేకుండా గోల్‌పోస్ట్‌ వరకు దూసుకుపోయే తత్వం, మెరుపు వేగంతో ప్రత్యర్థి డిఫెండర్లను ఏమార్చే వైనం, తనకే సాధ్యమైన అరుదైన విన్యాసాలతో రొనాల్డో ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఐకాన్‌గా మారిపోయాడు. 

ఈ పదిహేనేళ్లు అతని నామస్మరణతో అసంఖ్యాక ఫ్యాన్స్‌ ఊగిపోయారు. దాంతో సహజంగానే వాణిజ్యపరంగా అతని విలువ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఆటపరంగా ఒప్పందాల మొత్తం రికార్డులు సృష్టిస్తుండగా, బ్రాండింగ్‌ పరంగా కూడా అసాధారణ ఆర్జన అతని ఖాతాలో చేరింది. అత్యధిక మొత్తం అందుకున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో ఎప్పుడు చూసినా అతని పేరు కనిపించింది. ఆరేళ్ల క్రితమే కేవలం ఆటతోనే బిలియన్‌ డాలర్లు సంపాదించిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో గుర్తింపు పొందాడు. 

సీఆర్‌ 7 బ్రాండింగ్‌తో అతను ఏ వ్యాపారం మొదలు పెట్టినా కనకవర్షం కురిసింది. రియల్‌ మాడ్రిడ్‌తో విభేదాలతో ఇటలీలోని యువెంటస్‌ క్లబ్‌కు చేరినప్పుడు కూడా రికార్డు మొత్తంలో ట్రాన్స్‌ఫర్‌ జరిగింది. 100 మిలియన్‌ యూరోలు చెల్లించి యువెంటస్‌ సొంతం చేసుకోగా... తొలి రోజు కేవలం ఆ టీమ్‌లో రొనాల్డో జెర్సీ అమ్మకాల ద్వారానే  62.4 మిలియన్‌ డాలర్లు రావడం అతని స్థాయి ఏమిటో చూపించింది. 

గోల్‌ సాధించినప్పుడల్లా అతను తనదైన శైలిలో సుయ్‌య్‌య్‌... అంటూ ప్రదర్శించే ప్రత్యేక విన్యాసం ప్రతీ యువ ఫుట్‌బాల్‌ మదిలోసిగ్నేచర్‌గా నిలిచిపోయింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా రొనాల్డో అందనంత ఎత్తులో నిలిచాడు. సొంత దేశంలోనైతే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కే అతని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది.  

ప్రస్థానం ఎప్పటి వరకు...
జొహాన్‌న్‌క్రఫ్, ఫెరెన్స్‌ పుస్కాస్, పావోలో మాల్డిని, మైకేల్‌ ప్లాటిని, ఆల్ఫ్రెడో డి స్టిఫానో, డేవిడ్‌ బెక్‌హామ్, వేన్‌ రూనీ, ఒలివార్‌ కాన్, నెమార్‌... తమ అద్భుత ఆటతో ఫుట్‌బాల్‌లో ఎన్నో ఘనతలు సాధించినా వరల్డ్‌ కప్‌ను మాత్రం ముద్దాడని ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఈ జాబితాలో ఇప్పుడు రొనాల్డో కూడా చేరాడు. అతని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. అయితే ఆటలో పదును, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు కూడా అతని జోరు ముందు దిగదుడుపే. చివరి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడేసినా... పోర్చుగల్‌కు మున్ముందు కూడా ప్రాతినిధ్యం వహిస్తానని అతను చెబుతున్నాడు. అందుకే అధికారికంగా రిటైర్మెంట్‌ కూడా ప్రకటించలేదు. 

అయితే జాతీయ జట్టు తక్కువ సంఖ్యలో ఆడే మ్యాచ్‌లు, మార్పు కోరుకునే ఫెడరేషన్‌ వంటి కారణాలతో పోర్చుగల్‌ తరఫున మిగిలింది చాలా తక్కువ కెరీరే కావచ్చు. అయితే క్లబ్‌ ఫుట్‌బాల్‌లో మాత్రం అతని క్రేజ్‌ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్‌ నాసర్‌ క్లబ్‌కు అతను ఆడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చి అయినా సరే ఇప్పట్లో అతడిని వదిలేసేందుకు క్లబ్‌ ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పుకున్నా మరో క్లబ్‌ కచ్చితంగా ఈ సూపర్‌ స్టార్‌ కోసం వేచి చూస్తుందనడంలో సందేహం లేదు. వరల్డ్‌ కప్‌లో అతని స్థాయికి తగిన మెరుపులు కనిపించకపోయినా ... మరికొంత కాలం రొనాల్డో విన్యాసాలకు లోటు ఉండకపోవచ్చు.  

1 వరుసగా ఆరు ప్రపంచకప్‌లలో గోల్‌ చేసిన ఏకైక ప్లేయర్‌

146 జాతీయ జట్టు తరఫున ప్రపంచంలో అత్యధికగోల్స్‌ చేసిన ఆటగాడు 

233  జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లుఆడిన ఏకైక ప్లేయర్‌ 

4 రొనాల్డో నెగ్గిన క్లబ్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ టైటిల్స్‌. రియల్‌ మాడ్రిడ్‌ తరఫున మూడుసార్లు (2015, 2017, 2018), మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ తరఫున ఒకసారి (2009) రొనాల్డో ఈ ఘనత సాధించాడు.

35  కెరీర్‌లో రొనాల్డో గెలిచిన మొత్తం ట్రోఫీలు

100కోట్లు సోషల్‌ మీడియాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement