Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్‌’ కాలం

Commonwealth Games 2022: Stunning Sharath Kamal wins table tennis singles Gold for 2nd time in career - Sakshi

కామన్వెల్త్‌ క్రీడల్లో మొత్తం 13 పతకాలు గెలిచిన టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ శరత్‌ కమల్‌  

2006 – మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌ క్రీడలు – టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్‌జెల్‌పై విజయంతో స్వర్ణం...
2022 – బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడలు– సింగిల్స్‌ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌పై విజయంతో స్వర్ణం...

ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్‌ ఆటగాడే ఆచంట శరత్‌ కమల్‌. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్‌లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే...

వరుసగా ఐదు కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొని శరత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్‌ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్‌ కమల్‌ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు.  

కొత్త కుర్రాడిలాగే...
సుదీర్ఘ కాలంగా భారత టేబుల్‌ టెన్నిస్‌ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి శరత్‌ కమల్‌ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్‌ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్‌ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్‌ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top