commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’

commonwealth games 2022: My joy knows no bounds SAYS AAKULA SREEJA wins gold medal - Sakshi

 ‘సాక్షి’తో టీటీ ప్లేయర్‌ శ్రీజ  

శరత్‌ కమల్‌ తొలి కామన్వెల్త్‌ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్‌ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్‌ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్‌ స్థాయిలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్‌ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్‌ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్‌హామ్‌ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...

‘సింగిల్స్‌ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్‌ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్‌డ్‌లో ఇంకా ఫైనల్‌ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్‌ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్‌ అయిన ఆయన ప్రతీ మ్యాచ్‌లో, ప్రతీ పాయింట్‌కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు.

చివరకు నేను పాయింట్‌ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్‌ అన్నతో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడాను. నా కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌కు శరత్‌ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్‌ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్‌ గెలిచిన తర్వాత కూడా శరత్‌ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్‌డ్‌ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top