వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ కీలక ముందడుగు వేశాడు. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో యూనివర్సల్ బాస్ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియాన్స్ అనే జట్టుకు సహ యజమానిగా గేల్ వ్యవహరించనున్నాడు.
జట్టు కొనుగోలు
ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఆరు జట్లు భాగం కానుండగా.. స్కాట్లాండ్ దేశం నుంచి గ్లాస్గో ముగాఫియాన్స్ (Glasgow Mugafians) ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మహిళా వ్యాపారవేత్త తన్షా బాత్రాతో కలిసి క్రిస్ గేల్ ఈ జట్టును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఫ్రాంఛైజీకి గేల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో కలిపి క్రిస్ గేల్ ఏకంగా 463 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీ ఓనర్‌గా కొత్త అధ్యాయం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే.. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది ఆరంభం కానుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ లీగ్ సహయజమానిగా ఉన్నాడు.
ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. గ్లాస్గో, ఆమ్‌స్టర్‌డ్యామ్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, బెల్‌ఫాస్ట్, రాటర్‌డ్యామ్ రూపంలో ఆరు జట్లు ఈ లీగ్‌లో భాగంగా ఉన్నాయి.
యజమానులుగా మాజీ క్రికెటర్లు
ఆమ్‌స్టర్‌డ్యామ్ ఫ్రాంఛైజీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, హాకీ స్టార్ జేమీ డైయర్ సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు ఆసీస్ టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ సారథి.
బెల్‌ఫాస్ట్ జట్టుకు గ్లెన్ మాక్స్‌వెల్ సహ యజమానిగా ఉండగా.. ఎడిన్‌బర్గ్ ఫ్రాంఛైజీని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు కైలీ మిల్స్, నాథన్ మెకల్లమ్ దక్కించుకున్నారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్ కెప్టెన్.
చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్


