పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీ ఏజెంట్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే పీసీబీ ఘర్షణ వాతావరణం నెలకొనేలా చేసిందని.. తాము మాత్రం అలాంటి పనులకు వ్యతిరేకం అన్నాడు. అకారణంగా ముజర్‌బానీపై ద్వేషం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశాడు.
ఐపీఎల్ కోసం భారత్‌కు
కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే తరఫున మంచి ప్రదర్శన కనబర్చిన ముజర్‌బానీ (Blessing Muzarabani)ని పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు చెందిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకుంది. అయితే ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి పిలుపు రావడంతో ఈ పేస్ బౌలర్ పీఎస్‌ఎల్‌ను వీడి.. ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చేశాడు.
రెండేళ్ల నిషేధం
ఈ నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ముజర్‌బానీపై రెండేళ్ల నిషేధం విధించింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా వ్యవహరించాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే.
ఇలాంటి ప్రవర్తనను అనుమతించేది లేదు. అందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’ అని పీఎస్‌ఎల్ పాలక మండలి గత మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముజర్‌బానీ ఏజెంట్ తాజాగా స్పందించాడు.
మేము మీలా కాదు
‘‘గత ఆరు వారాలుగా మేము బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకంటే మేము ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వాలనుకోవడం లేదు. ఈ విషయంలో పీఎస్‌ఎల్, పీసీబీ ఇప్పటికే ఘర్షణపూరిత వాతావరణం సృష్టించింది. అయితే, మాకు అలా చేయడం ఇష్టం లేదు.
బ్లెస్సింగ్ మీద సోషల్ మీడియాలో పీఎస్‌ఎల్ అభిమానులు విషం చిమ్ముతున్నారు. అతడిని విమర్శించడం తప్పుకాదు. కానీ విమర్శిస్తున్న వంక మీద ఇష్టారీతిన కామెంట్లు చేస్తే ఇకపై సహించేది లేదు.
మీరంతా పిరికిపందలు
బ్లెస్సింగ్ ఎక్కడ ఆడినా అక్కడి అభిమానులను ఎంతగానో ప్రేమిస్తాడు. ఫ్యాన్స్ కోసం సమయం కేటాయిస్తాడు. తను అద్భుతమైన వ్యక్తి. వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా పరిణతి చెందుతున్నాడు. ఇలాంటి సమయంలో కొందరు సోకాల్డ్ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో అతడిపై విద్వేష విషం చిమ్ముతున్నారు.
మీరంతా పిరికిపందలు. మీకసలు మానవత్వం అన్న పదానికి అర్థం కూడా తెలియదు. అయినా గతంలో.. పీఎస్‌ఎల్ కాంట్రాక్టు వదిలేసుకున్న ఆటగాళ్లపై పీసీబీ ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు పీఎస్‌ఎల్‌ను వదులుకున్న విషయంలో గతంలో ఏ ఆటగాడు కూడా ఇంతగా విమర్శలకు గురికాలేదు.
ఇది మీవైపు నుంచి జరిగిన తప్పు
ఇందులో అసలు అతడి తప్పేముంది? అసలు అతడు కాంట్రాక్టు మీద సంతకం చేయనేలేదు కదా!.. పరిస్థితులను అర్థం చేసుకుని పీసీబీ నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది వారి పాలక మండలి తప్పిదం అని అనుకుంటున్నా. ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సిందేమీ లేదు’’ అని బ్లెస్సింగ్ ముజర్‌బానీ ఏజెంట్ పీసీబీకి ఘాటు సమాధానం ఇచ్చాడు. కాగా ముజర్‌బానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: లక్నోను మట్టికరిపించిన అనంతరం శ్రేయస్ వ్యాఖ్యలివే..!


