శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ జట్టు ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి.. ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్ (40), బదోని (35), పంత్ (43), మార్క్రమ్ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. జన్సెన్ (4-0-37-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (4-0-30-1), చహల్ (4-0-36-1) లక్నో బ్యాటర్లకు పగ్గాలు వేశారు.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు, బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.
అతని మాటల్లోనే.. ఆ భాగస్వామ్యం అసాధారణంగా ఉంది. కొన్ని షాట్లు చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్ ఫుట్‌పై స్ట్రైట్‌గా ఆడటం, స్పిన్నర్లపై కూడా అదే ధైర్యంతో దాడి చేయడం గొప్ప నైపుణ్యం. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఆ భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసింది. ఆ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటగాళ్లు చూపిన ధైర్యం, స్థిరత్వం ప్రశంసనీయం.
జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక సరదా పోటీ పెట్టుకున్నాం. జట్టులో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తానని చెప్పాను. ఇది పెద్ద బహుమతి కాకపోయినా, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచి, స్వేచ్ఛగా ఆడేలా చేస్తుంది. ఆటగాళ్లను ఎక్కువగా నియంత్రించకుండా స్వేచ్ఛ ఇస్తే వారు తమ ప్రతిభను మెరుగ్గా ప్రదర్శిస్తారన్నది నా అభిప్రాయం.
బౌలింగ్ విభాగంపై కూడా అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోని బౌలర్లు అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన వారని, వారు ఇప్పటికే తమ దేశాల తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చారని గుర్తుచేశారు. మ్యాచ్‌కు ముందు వ్యూహాలు చర్చించి, వాటిని అమలు చేయడమే ముఖ్యమని అన్నారు. ఈ సీజన్ మొత్తం బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని, అదే ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇక న్యూ చండీగఢ్ మైదానాన్ని “కంచుకోట”గా మార్చడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఈసారి పిచ్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించేలా మైదానాన్ని రూపొందించామని, ఇప్పటివరకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు.


