ఎవరు పడితే వాళ్లు కోచ్‌ కాలేరు?.. గంగూలీ పోస్ట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

ఎవరు పడితే వాళ్లు కోచ్‌ కాలేరు?.. గంగూలీ పోస్ట్‌ వైరల్‌

Published Thu, May 30 2024 4:20 PM

Choose Wisely: Ganguly Cryptic Post Amid Reports Gambhir Likely Next India Coach

టీమిండియా కొత్త కోచ్‌ నియామకం నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు హెడ్‌ కోచ్‌ అంటే ఆషామాషీ కాదని.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని బీసీసీఐకి సూచించాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకోనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినా బీసీసీఐ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ద్రవిడ్‌ కోచ్‌గా కొనసాగుతున్నాడు.

అయితే, మెగా టోర్నీ తర్వాత మాత్రం ద్రవిడ్‌ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఇప్పటికే కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 27తో గడువు ముగిసింది.

గంభీర్‌ పేరు దాదాపు ఖరారైనట్లే!
కానీ ఇంతవరకు కొత్త కోచ్‌ ఎవరన్నా అన్న విషయంపై  ఎటువంటి స్పష్టత రాలేదు. విదేశీ కోచ్‌ల వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చినా.. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్‌, ఆశిష్‌ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో.. ఐపీఎల్‌-2024 చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌ గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా దాదాపు ఖరారైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది.

తెలివిగా వ్యవహరించాలి
‘‘ఎవరి జీవితంలోనైనా కోచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మైదానం లోపల.. వెలుపలా.. ఒక వ్యక్తికి మార్గదర్శనం చేస్తూ వారిని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత. 

కాబట్టి కోచ్‌ని ఎంచుకునేటపుడు తెలివిగా వ్యవహరించాలి’’ అని గంగూలీ ట్వీట్‌ చేశాడు. ఎవరు పడితే వాళ్లను కోచ్‌లుగా నియమించొద్దని పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు.

ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘గంభీర్‌కు వ్యతిరేకంగానే మీరు ఈ పోస్ట్‌ పెట్టారు కదా? ఆయన హెడ్‌కోచ్‌ అవటం మీకు ఇష్టం లేదా?’’ అంటూ గంగూలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

అయితే, దాదా అభిమానులు మాత్రం.. ‘‘గ్రెగ్‌ చాపెల్‌ మాదిరి ఇంకో కోచ్‌ వస్తే ఆటగాళ్లను విభజించి జట్టును భిన్న వర్గాలుగా విడదీస్తాడనే భయంతోనే గంగూలీ ఇలా జాగ్రత్తలు చెబుతున్నారు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.

చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్‌ ఏంటి?.. పూర్తి వివరాలు

Advertisement
 
Advertisement
 
Advertisement