నాగ చైతన్యతో గంగూలీ..జాన్‌ అబ్రహాం ఢీ | Naga Chaitanya, Ganguly, John Abraham, Sundeep At Indian Racing League | Sakshi
Sakshi News home page

నాగ చైతన్యతో గంగూలీ..జాన్‌ అబ్రహాం ఢీ

Feb 18 2026 1:58 PM | Updated on Feb 18 2026 3:04 PM

Naga Chaitanya, Ganguly, John Abraham, Sundeep At Indian Racing League

గోవా నుంచి ముంబయికి మారిన రేసింగ్‌ సమరం...

సినిమా తారలు, వెండితెర ప్రముఖులు తమ సినిమాల ద్వారా పోటీ పడడం అనేది దశాబ్ధాల తరబడి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తారల సమరం సినిమాలను దాటేసింది. క్రికెట్‌లో ఐపీఎల్‌ అనేది ఎప్పుడైతే ఒక సక్సెస్‌ ఫార్ములాగా మారిందో.. అప్పుడే స్టార్‌ ఫైట్‌ సినిమాలను దాటి క్రీడలకూ విస్తరించింది. క్రికెట్, ఫుట్‌బాల్‌...తదితర క్రీడలన్నీ ఐపీఎల్‌ తరహాలోనే లీగ్స్‌ నిర్వహిస్తూంటే సినీ తారలు పలు క్రీడా జట్లకు అధిపతులుగా మారుతూ ఆటతో పాటు ఆదాయాన్ని కూడా అందుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే తరహాలో కొత్తగా క్రీడాలోకంలో తెరకెక్కింది ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌. ఫార్ములా వన్‌ కార్ల తరహాలో సింగిల్‌ సీటింగ్‌తో తయారైన కార్లతో ప్రత్యేకంగా నిర్వహించే అంతర్జాతీయ మోటార్‌ స్పోర్ట్‌ ఇది.

తొలిసారి మన దేశంలో జరుగుతున్న ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ లో మొత్తం 6 టీమ్స్‌ పోటీపడుతున్నాయి. ఈ టీమ్స్‌కు పలువురు సినీ తారలు సారధ్యం వహిస్తుండడం విశేషం. ఈ పోటీలో టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగ చైతన్య  హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ టీమ్‌కు సారధిగా ఉన్నాడు. తొలి నుంచీ రేసింగ్‌ అంటే ఇష్టం చూపించే నాగ చైతన్య అదే క్రమంలో స్థానిక టీమ్‌ను దక్కించుకున్నాడు. ఆయనకు పోటీగా ఐఆర్‌ఎల్‌లో  బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం (గోవా ఏసెస్‌ జెఎ రేసింగ్‌), కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ (కిచ్చాస్‌ కింగ్స్‌ బెంగళూరు), మాజీ క్రికెటర్‌  సౌరవ్‌ గంగూలీ (కోల్‌కతా రాయల్‌ టైగర్స్‌) మరో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ కపూర్‌(స్పీడ్‌ డెమన్స్‌ ఢిల్లీ) (చెన్నై టర్బో రైడర్స్‌)లు ఢీ కొడుతున్నారు. 

తాజాగా గోవాలో జరిగిన ఈ లీగ్‌ పోటీల్లో వీరు క్రీడ, వినోదం  మిళితం చేసిన వారాంతానికి స్టార్‌ అట్రాక్షన్‌ జోడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ యజమాని హోదాలో నాగ చైతన్య మాట్లాడుతూ, ‘‘మన దేశంలో ఈ క్రీడకు మద్దతు అంతకంతకూ పెరుగుతుండటం  అద్భుతంగా ఉంది. గోవా లాంటి ఒక నగరంలో ఇలాంటి స్ట్రీట్‌ రేస్‌ నిర్వహించడానికి గట్టి ప్రయత్నం  అభిరుచి అవసరం,  దానిని సాధ్యం చేసినందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. పోటీలు, గెలుపు సంగతి ఎలా ఉన్నా యువతకు ఒక వేదికను ఇవ్వడం ముఖ్యం అనేది నా అభిప్రాయం. 

 మోటార్‌స్పోర్ట్‌ భారతదేశంలో ఇంకా కొత్త కావచ్చు, కానీ ఓర్పు  నిరంతర ప్రోత్సాహంతో అది మరింత ఉన్నతంగా ఎదుగుతుంది.  యువ డ్రైవర్లకు నేను శుభాకాంక్షలు’’ అంటూ చెప్పారు.  పేరుకు తగినట్లుగా, ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌ కేవలం క్రీడా పోటీ కి విభిన్నంగా కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్వాహకులు వారాంతాన్ని జీవనశైలి కార్యక్రమంగా మారుస్తున్నారు. అత్యంత ఖరీదైన  క్రీడగా పేరొందిన ఈ రేసింగ్‌ను మన దేశంలో ఊపు తేవడానికి సినిమా తారలు తమ వంతు ప్రయత్నం చేయడం అభినందనీయం. గత ఏడాది ఆగస్టులో కోయంబత్తూర్‌ వేదికగా ప్రారంభమైన ఈ లీగ్‌ గోవా పోటీలతో 4దశలు పూర్తి చేసుకుంది. వచ్చే మార్చి నెలలో ముంబైలో జరిగే తుది పోరులో విజేత జట్టు ఎవరో తేలనుంది. ప్రస్తుతానికి ఈ పోటీల్లో జాన్‌ అబ్రహాంకు చెందిన టీమ్, అర్జున్‌కపూర్‌ల టీమ్స్‌ ముందంజలో ఉండగా నాగచైతన్య టీమ్‌ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement