
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన కుమారుడు అగస్త్య (Agasthya)ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ ప్రపంచంలో అందరి కంటే తాను ఎక్కువగా అగస్త్యనే ప్రేమిస్తానని తెలిపాడు. ఈ చిన్నారి రాకతో తన ప్రపంచమే మారిపోయిందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లాడిన హార్దిక్ పాండ్యా.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరి సంతానమే అగస్త్య. బుధవారం (జూలై 30) అతడు ఐదో వసంతంలో అడుగుపెట్టాడు.
నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం నువ్వు
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా.. ‘‘వ్యక్తిగా నేను రోజురోజుకీ మరింత మెరుగపడేలా చేసే దైవదూత. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. నీతో గడిపే ఇలాంటి క్షణాల కంటే నాకు ఇంకేమీ గొప్పకాదు.
నా జీవితాన్నే మార్చివేసిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం నువ్వు. నేను చేసే ప్రతి చిలిపి పనిలోనూ నువ్వే నా పార్ట్‌నర్’’ అంటూ అగస్త్యతో కలిసి కెమెరా రికార్డింగ్ చేస్తున్న వీడియోను హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు.
ఇందులో తన పేరు చెప్పమని బతిమిలాడగా.. ఆఖర్లో ఆ పిల్లాడు అగస్త్య హార్దిక్ పాండ్యా అని చెప్తాడు. తండ్రీకొడుకుల బంధం చూసి నెటిజన్లు.. ‘మీకు ఎవరి దిష్టీ తగలకూడదు’ అంటూ అగస్త్యకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం అగస్త్యకు తల్లి- తండ్రితో కలిసి పుట్టినరోజు జరుపుకొనే అదృష్టం మాత్రం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇక మార్చిలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొంది టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
హార్దిక్ అలా.. నటాషా ఇలా
మరోవైపు.. హార్దిక్ మాజీ భార్య నటాషా కూడా అగస్త్య బర్త్‌డే సందర్భంగా క్యూట్ వీడియో షేర్ చేసింది. ‘‘నా అగులీ.. నా సర్వస్వం నువ్వే. నిన్ను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ప్రతిరోజూ ధన్యవాదాలు చెబుతూనే ఉంటా.
నీ చిరునవ్వు.., నీ ఆలింగనం.. నీ ఆప్యాయపు ముద్దులు.. ఇవే నాకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. నన్ను ముందుకు నడిపిస్తాయి. నువ్వెంత విలువైనవాడివో నీకు తెలియదు రా కన్నా! కాలం మారినా.. నువ్వెప్పుడూ నాతో ఇలాగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ఎమోషనల్ నోట్ రాసింది.