భారత్‌లో మరోసారి కామన్వెల్త్‌ క్రీడలు! | Central government showing interest in hosting Commonwealth Games for the second time in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరోసారి కామన్వెల్త్‌ క్రీడలు!

Feb 22 2025 3:50 AM | Updated on Feb 22 2025 3:50 AM

Central government showing interest in hosting Commonwealth Games for the second time in India

‘2030’పై కేంద్ర ప్రభుత్వం దృష్టి 

న్యూఢిల్లీ: భారత్‌లో రెండోసారి కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. 2030లో జరిగే పోటీల కోసం బిడ్‌ వేయాలని యోచిస్తోందని క్రీడా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్‌ క్రీడలు జరిగాయి. క్రీడలను నిర్వహించడంతో పాటు 2026 కామన్వెల్త్‌ క్రీడల నుంచి తొలగించిన క్రీడాంశాలను కూడా మళ్లీ చేర్చే ఆలోచనలో భారత్‌ ఉంది. 2030 క్రీడల నిర్వహణకు ‘ఆసక్తిని ప్రదర్శించే’ ప్రక్రియకు మార్చి 31 చివరి తేదీ కాగా... ఈ దిశగానే ప్రయత్నం మొదలైనట్లు అధికారి చెప్పారు. 

‘కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధికారులతో చర్చలు జరిగాయి. 2030లో మేం నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా చెప్పాం. 2026లో తొలగించిన అన్ని క్రీడాంశాలను 2030లో చేర్చే విధంగా చూడాలని కూడా చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. 2026లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే బడ్జెట్‌ పరిమితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహక కమిటీ కేవలం 10 క్రీడాంశాలకే పోటీలను పరిమితం చేసింది. 

ఈ క్రమంలో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్‌ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్, క్రికెట్‌లను పోటీల నుంచి తొలగించారు. ఇవే క్రీడాంశాల్లో భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉండేది. కమిటీ నిర్ణయం కారణంగా భారత్‌కు పెద్ద సంఖ్యలో పతకాలు వచ్చే అవకాశం ఉన్న ఆటలన్నీ క్రీడల్లో లేకుండాపోయాయి. గతంలో ఇదే తరహాలో 2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల నుంచి కూడా ఆర్చరీ, షూటింగ్‌లను తొలగించిన తర్వాత వాటిని మళ్లీ చేర్చాలంటూ భారత్‌ విజ్ఞప్తి చేసింది. 

దీనికి సానుకూల స్పందన వచ్చినా కోవిడ్‌ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అయితే వన్నె తగ్గిన కామన్వెల్త్‌ క్రీడలను నిర్వహించే విషయంలో ఆర్థికభారం కారణంగా పలు పెద్ద దేశాలు కూడా వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో భారత్‌ ముందుకు వెళ్లడం ఆశ్చర్యకర పరిణామం! 2026కు ముందుగా ఆ్రస్టేలియాలోని విక్టోరియా వేదిక కాగా... 2023 జూలైలో ఆ దేశం అనూహ్యంగా తప్పుకుంది. నిర్వాహక కమిటీ మలేసియా దేశానికి ఆఫర్‌ ఇచ్చినా అదీ అంగీకరించలేదు. 

చివరకు తక్కువ బడ్జెట్‌తో, అదీ గేమ్స్‌ ఫెడరేషన్‌ సంయుక్త ఆరి్థక సహకారంతో గ్లాస్గో ముందుకు వచి్చంది. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 23వ కామన్వెల్త్‌ క్రీడలు జరుగుతాయి. మరోవైపు 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు ఆసక్తి చూపిస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి లేఖ పంపించింది. వచ్చే మార్చి తర్వాత దీని పురోగతిపై స్పష్టత రావచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement