బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నేటి నుంచే.. | BWF World Tour Finals from today | Sakshi
Sakshi News home page

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నేటి నుంచే..

Dec 11 2024 3:56 AM | Updated on Dec 11 2024 7:25 AM

BWF World Tour Finals from today

నేటి నుంచి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌

మహిళల డబుల్స్‌ బరిలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 

భారత జోడీకి క్లిష్టమైన ‘డ్రా’ 

హాంగ్జౌ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు నేడు తెర లేవనుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొత్తం ఐదు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈసారి భారత్‌ నుంచి కేవలం మహిళల డబుల్స్‌లో మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. 

భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె పుల్లెల గాయత్రి, కేరళ అమ్మాయి ట్రెసా జాలీ మహిళల డబుల్స్‌లో జోడీగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది ఆయా టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్‌–8లో నిలిచిన వారు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 

పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ టాప్‌–8లో నిలవకపోవడంతో ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని పొందలేకపోయారు. ఈ టోర్నీ చరిత్ర లో భారత్‌ నుంచి పీవీ సింధు 2018లో మహిళల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. 

కఠిన ప్రత్యర్థులే... 
సీజన్‌ ముగింపు టోర్నీలో గాయత్రి–ట్రెసా జోడీకి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. మహిళల డబుల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో ప్రపంచ నంబర్‌వన్‌ జంట లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌ (చైనా), ప్రపంచ నాలుగో ర్యాంక్‌ జోడీ షిడా చిహారు–నామి మత్సుయామ (జపాన్‌), ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ద్వయం పియర్లీ టాన్‌–థీనా మురళీధరన్‌ (మలేసియా)లతో 13వ స్థానంలో ఉన్న గాయత్రి–ట్రెసా తలపడాల్సి ఉంది. బుధవారం జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌లతో గాయత్రి–ట్రెసా ఆడతారు.  

ప్రైజ్‌మనీ ఎంతంటే... 
వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ మొత్తం ప్రైజ్‌మనీ 25 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల 21 లక్షలు). పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 69 లక్షలు) చొప్పున... మూడు డబుల్స్‌ విభాగాల్లో టైటిల్స్‌ నెగ్గిన వారికి 2 లక్షల 10 వేల డాలర్ల (రూ. 1 కోటీ 78 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. రన్నరప్, సెమీఫైనలిస్ట్‌లకు, గ్రూపుల్లో మూడో స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా ప్రైజ్‌మనీ అందజేస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement