చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. పాపం పసికూన! | Bosch Fifer South Africa Beat Zimbabwe in 1st Test By 328 Runs | Sakshi
Sakshi News home page

చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. వరల్డ్‌ చాంపియన్‌ చేతిలో జింబాబ్వే చిత్తు

Jul 1 2025 6:09 PM | Updated on Jul 1 2025 6:27 PM

Bosch Fifer South Africa Beat Zimbabwe in 1st Test By 328 Runs

జింబాబ్వేతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 328 పరుగుల భారీ తేడాతో ఓడించి జయభేరి మోగించింది. కీలక ఆటగాళ్లు జట్టుతో లేకపోయినా ప్రొటిస్‌ జట్టు ఆద్యంత ఆధిపత్యం కనబరిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

అరంగేట్రంలోనే సత్తా చాటిన చిచ్చరపిడుగులు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)-2025 ఫైనల్‌ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా.. తొలుత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బవుమా (Temba Bavuma)తో పాటు ఐడెన్‌ మార్క్రమ్‌ వంటి కీలక ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కాగా.. కేశవ్‌ మహరాజ్‌ సారథ్యంలో లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ టెస్టులలో అరంగేట్రం చేశారు.

ఇక బులవాయో వేదికగా జూన్‌ 28న మొదలైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌ విఫలమైనప్పటికీ టీనేజర్లు లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ అదరొట్టారు. ప్రిటోరియస్‌ భారీ శతకం (153) బాదగా.. బ్రెవిస్‌ (41 బంతుల్లో 51) మెరుపు హాఫ్‌ సెంచరీ చేశాడు.

వీరిద్దరికి తోడు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ శతకం (100 నాటౌట్‌)తో చెలరేగాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగుల వద్ద ప్రొటిస్‌ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. జింబాబ్వే బౌలర్లలో టనకా చివాంగ నాలుగు వికెట్లు తీయగా.. ముజర్‌బానీ రెండు, మసకజ్ద, మసేకెస ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

 251 పరుగులకే ఆలౌట్‌ 
ఇక తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 251 పరుగులకే ఆలౌట్‌ అయింది. సీన్‌ విలియమ్స్‌ (137) శతక్కొట్టగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రొటిస్‌ బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, కోడి యూసఫ్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

ఈ క్రమంలో 167 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 369 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఈసారి వియాన్‌ ముల్డర్‌ (147) శతకంతో ఆకట్టుకోగా.. కేశవ్‌ మహరాజ్‌ హాఫ్‌ సెంచరీ (51) చేశాడు.

జింబాబ్వే బౌలర్లలో ఈసారి మసకజ్ద నాలుగు, చివాంగ, మసెకెస రెండేసి వికెట్లు తీయగా.. ముజర్‌బానీ, మెధెవెరె చెరో వికెట్‌ పడగొట్టారు. 

భారీ లక్ష్య ఛేదనలో తడబడి
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని సౌతాఫ్రికా జింబాబ్వేకు 537 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 208 పరుగులకే జింబాబ్వే ఆలౌట్‌ కాగా.. సౌతాఫ్రికా భారీ గెలుపు దక్కించుకుంది.

మరోవైపు.. టెస్టుల్లో జింబాబ్వేకు ఇదే అతిపెద్ద పరాజయం. ఇదిలా ఉంటే.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో కార్బిన్‌ బాష్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. యూసఫ్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా 19 ఏళ్ల చిచ్చరపిడుగు ప్రిటోరియస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

జింబాబ్వే వర్సెస్‌ సౌతాఫ్రికా తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 418/9 d & 369
జింబాబ్వే: 251 & 208.

చదవండి: IPL 2026: సీఎస్‌కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్‌కు రుతురాజ్‌?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement