
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టు మారనున్నాడా? రాజస్తాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరనున్నాడా? అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై సీఎస్‌కే ఒక్కటే కాదు.. ఇంకో రెండు-మూడు ఫ్రాంఛైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
కేరళ స్టార్ సంజూ శాంసన్ 2013లో ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన అతడు.. ఆ తర్వాత జట్టుపై నిషేధం పడటంతో 2016-17 సీజన్లలో ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారాడు. అయితే, 2018లో తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.
ఫైనల్ చేర్చిన సారథి
ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగిన సంజూ.. 2021లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సారథిగా అత్యుత్తమంగా 2022లో రాజస్తాన్‌ను అతడు ఫైనల్‌కు చేర్చాడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన రాజస్తాన్.. మళ్లీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక 2023లో ఐదోస్థానంతో ముగించిన సంజూ సేన.. 2024లో ప్లే ఆఫ్స్ చేరినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది.
ఇక ఈ ఏడాది సంజూ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగగా.. రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే... కొత్త హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంజూకు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. ద్రవిడ్ వాటిని ఖండించాడు. మరోవైపు.. రియాన్ పరాగ్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేయాలనే యోచనలో రాజస్తాన్ మేనేజ్‌మెంట్ ఉందనే రూమర్లు వస్తున్నాయి.
సంజూపై సీఎస్‌కే ఆసక్తి నిజమే
ఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ రాజస్తాన్‌ను వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. సీఎస్‌కే ఈ రేసులో ముందున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్‌కే వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సంజూ భారత బ్యాటర్. వికెట్ కీపర్. ఓపెనింగ్ కూడా చేయగలడు.
కాబట్టి కచ్చితంగా అతడిని జట్టులో చేర్చుకోవాలని మాకూ ఆసక్తి ఉంది. ఒకవేళ అతడు అందుబాటులో ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ట్రేడ్ చేసుకునైనా అతడిని దక్కించుకుంటాం. అయితే, విషయం అంతవరకు రాలేదు కానీ మాకు మాత్రం అతడిని తీసుకోవడం పట్ల కచ్చితంగా ఆసక్తి ఉంది’’ అని పేర్కొన్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.
రుతును ఇచ్చేస్తారా?
ఒకవేళ చెన్నై జట్టు గనుక సంజూను దక్కించుకోవాలంటే రాజస్తాన్ ప్లేయర్-టు- ప్లేయర్ ట్రేడ్ వైపే మొగ్గు చూపవచ్చు. అలా అయితే, 2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్ సంజూను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టుకు అతడే కెప్టెన్.
మరోవైపు.. సీఎస్‌కే తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను అట్టిపెట్టుకునేందుకు రూ. 18 కోట్లు కేటాయించింది. కాబట్టి ఒకేస్థాయి ఆటగాళ్ల మార్పిడి జరగాలంటే సంజూ- రుతులను ఎక్స్చేంచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, సీఎస్‌కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే చాలాసార్లు రుతు గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అతడిని సారథిగా నియమించినట్లు తెలిపాడు. మరి అలాంటపుడు సంజూను ఎవరితో మార్చుకుంటారు?.. అసలు అతడిని వదులుకునేందుకు రాజస్తాన్ సిద్ధంగా ఉందా??.. అంటే మినీ వేలం సమయంలోనే తేలుతుంది.