BGT 2023 IND VS AUS: భారత క్రికెట్‌ చరిత్రలో ఎవ్వరి వల్ల కాలేదు.. రోహిత్‌కు ఆ ఛాన్స్‌ వచ్చింది..!

BGT 2023: Rohit Sharma Will Become 4th Captain To Score Centuries In 3 Formats - Sakshi

భారత క్రికెట్‌ చరిత్రలో ఏ ఒక్క కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో హిట్‌మ్యాన్‌ ఓ సెంచరీ చేస్తే, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

రోహిత్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. BGT 2023లో భాగంగా జరిగే 4 టెస్ట్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఒక్క సెంచరీ చేసినా, దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోని, కోహిలకు సాధ్యంకాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు.

టెస్ట్‌ల్లో రోహిత్‌ 8 సెంచరీలు చేసినప్పటికీ, అవన్నీ ఆటగాడిగా సాధించినవే. కాగా, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ముగ్గురి పేరిట ఉంది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్‌ తిలకరత్నే దిల్షాన్‌ ఈ ఘనత సాధించగా.. ఆతర్వాత సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఇటీవలే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. 

ఇదిలా ఉంటే, నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. 

ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే..  భారత్‌-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్‌ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్‌ 12, భారత్‌ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్  

సిరీస్‌ షెడ్యూల్‌..

  • ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్‌, నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌, ఢిల్లీ
  • మార్చి 1-5 వరకు మూడో టెస్ట్‌, ధర్మశాల
  • మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌, అహ్మదాబాద్‌

వన్డే సిరీస్‌..

  • మార్చి 17న తొలి వన్డే, ముంబై
  • మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం
  • మార్చి 22న మూడో వన్డే, చెన్నై 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top