BCCI: 'భారత క్రికెట్‌ జట్లను చైనాకు పంపించలేం'

BCCI decides Not-Send Indian cricket Teams for Asian Games in China - Sakshi

ఈ ఏడాది చైనాలో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌కు భారత క్రికెట్‌ జట్లను(పురుషులు, మహిళలు) పంపించలేమని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగామ్‌(ఎఫ్‌టీపీ)లో భాగంగా కొన్ని కమిట్‌మెంట్స్‌ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు చైనాలోని హాంగ్జౌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ జరగనున్నాయి.  గతేడాది బర్మింగ్‌హమ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు బీసీసీఐ మహిళల క్రికెట్‌ జట్టును పంపిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన హర్మన్‌ సేన సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లానే ఏషియన్‌ గేమ్స్‌లోనూ ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టారు.  భారత ఏషియన్‌ గేమ్స్‌ చీఫ్‌ భుపేందర్‌ భజ్వా మాట్లాడుతూ.. ''చైనాలో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌లో అన్ని విభాగాల్లో ఎంట్రీ పేర్లు ఇచ్చాం.. ఒక్క క్రికెట్‌ తప్ప.. ఎందుకంటే క్రికెట్‌ జట్లను అక్కడికి పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది.'' అని తెలిపాడు.

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..''డెడ్‌లైన్‌కు ఒక్కరోజు ముందు మాకు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) నుంచి మెయిల్‌ వచ్చింది. కానీ అప్పటికే బీసీసీఐ ఎఫ్‌టీపీలో భాగంగా పరుషులు, మహిళల క్రికెట్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసింది. ఏషియన్‌ గేమ్స్‌ సమయంలో ముఖ్యమైన మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే భారత క్రికెట్‌ జట్లను చైనాకు పంపించకూడదని నిర్ణయించుకున్నాం.'' అని పేర్కొన్నాడు.

ఇక  ఎఫ్‌టీపీ ప్రకారం టీమిండియా మెన్స్‌ జట్టు అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ ఆడనుంది. అదే సమయంలో మహిళల జట్టు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. అయితే ఏషియన్‌ గేమ్స్‌ కూడా అప్పుడే జరుగుతున్నందున వేరే దారి లేక పోటీల్లో తాము పాల్గొనడం లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

అయితే ఒకవేళ ఏషియన్‌ గేమ్స్‌లో ఆడాలనుకుంటే బీసీసీఐకి ఒక దారి ఉంది.  మహిళల క్రికెట్‌కు అవకాశం లేనప్పటికి.. పురుషుల క్రికెట్‌లో మాత్రం అందుకు ఆస్కారం ఉంది. వన్డే ప్రపంచకప్‌కు ఎలాగూ సీనియర్‌ జట్టు ఉంటుంది కాబట్టి.. ఏషియన్‌ గేమ్స్‌కు జూనియర్‌ జట్టును పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

గతంలోనూ 1998లో కౌలలంపూర్‌ లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పాల్గొంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో టొరంటోలో మరో టీమిండియా జట్టు వన్డే సిరీస్‌ను ఆడింది. తాజాగా 2021లో భారత సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లగా.. శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో జూనియర్‌ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్‌ ఆడింది.

ఈ ప్లాన్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఏషియన్‌ గేమ్స్‌కు ఇలాంటి స్ట్రాటజీని అమలు చేస్తే బాగుంటుందని.. పైగా ఏషియన్‌ గేమ్స్‌లో పతకం తేవడం దేశానికి కూడా గర్వకారణం అవుతుంది. కాగా హాంగ్జౌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ గతేడాదే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.

చదవండి: #Gary Balance: 'రెండు' దేశాల క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. బ్రాడ్‌మన్‌తో పోల్చిన వైనం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top