ఏమో నాకైతే తెలియదు.. అతడికి మరో ఛాన్స్‌: భారత బ్యాటింగ్‌ కోచ్‌

Batting coach Vikram Rathour on KL Rahuls fitness concerns - Sakshi

రాంఛీ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని భారత్‌ ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌ సైతం ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరమయ్యాడు.

హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన రాహుల్‌.. వైజాగ్‌, రాజ్‌కోట్‌ టెస్టులకు దూరమయ్యాడు. కానీ రాంఛీ టెస్టుకు ముందు అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని, తిరిగి జట్టుతో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం రాహుల్ ఇంకా ఫిట్‌నెస్‌ సాధించలేదని, నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడనిఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే విషయంపై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"కెఎల్‌ రాహుల్‌ ఎంత శాతం ఫిట్‌నెస్‌ సాధించాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు మ్యాచ్‌ ఆడే ఫిట్‌నెస్‌ అయితే అతడు సాధించలేదు అనుకుంటున్నాను.  అతడి పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నదని రాథోర్‌ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

ఇక రాహుల్‌ గైర్హాజరు నేపథ్యంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ రజిత్‌ పాటిదార్‌ను తుది జట్టులో కొనసాగించే ఛాన్స్‌ ఉంది. ఇదే విషయంపై వి​‍క్రమ్‌ రాథోర్‌ మాట్లాడుతూ..  "పాటిదార్‌ అద్బుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అతడితో మేము చర్చలు జరుపుతున్నాం. అతడు తన ప్రతిభను నిరూపించుకుంటాడని భావిస్తున్నాము. అతడికి జట్టు మెనెజ్‌మెంట్‌ మొత్తం సపోర్ట్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా వైజాగ్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్‌ పెద్దగా అకట్టుకోలేకపోయాడు.

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top