T20 World Cup 2021 Winner Australia: ఆసీస్‌కు అందిన ద్రాక్ష

Australia Won T20 World Cup 2021 Beat New Zeland By 8 Wickets Final - Sakshi

టి20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

తొలిసారి టైటిల్‌ సాధించిన కంగారూ జట్టు

ఫైనల్లో 8 వికెట్లతోన్యూజిలాండ్‌పై ఘనవిజయం

వార్నర్, మార్ష్‌ అద్భుత ప్రదర్శన ∙ విలియమ్సన్‌ శ్రమ వృథా

2022లో ఆస్ట్రేలియాలోనే వచ్చే టి20 ప్రపంచకప్‌

సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాలు శాసించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. వన్డే క్రికెట్‌లో ఐదుసార్లు జగజ్జేతగా నిలిచినా ‘ఆ ఒక్క లోటు’ మాత్రం ఉండిపోయింది. టి20 క్రికెట్‌ ప్రస్తావన రాగానే ఇంతకాలం ఆస్ట్రేలియా గురించి చెప్పే ఒకే ఒక్క మాట ఇది...

ఆస్ట్రేలియా టీమ్‌ గురించి ఇకపై అలాంటి మాటకు అవకాశమే లేదు. 2007 నుంచి తొలి టైటిల్‌ కోసం ప్రయత్నిస్తున్న కంగారూలు ఎట్టకేలకు 14 ఏళ్ల ‘జైలు గోడలను’ బద్దలు కొట్టారు. టి20 ప్రపంచకప్‌లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచి ఇంతకాలంగా అందని ట్రోఫీని తమ ఖాతాలో వేసుకొని సగర్వంగా నిలిచారు. టోర్నీ ఆరంభానికి ముందు ఎలాంటి అంచనాలు లేని, ఫేవరెట్‌ అంటూ ఎవరూ చెప్పని జట్టు చివరకు చాంపియన్‌ తరహా ఆటతో సత్తా చాటింది.

నాకౌట్‌ మ్యాచ్‌లలో కనిపించే ఒత్తిడి, ఆందోళన తమ దరికి రావని చాటి చెబుతూ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను అందుకుంది. సెమీస్‌లో సూపర్‌ ఆటతో పాక్‌ను చిత్తు చేసిన టీమ్‌ తుది పోరులోనూ అదే స్థాయిని ప్రదర్శించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ముందుగా ప్రత్యర్థి న్యూజిలాండ్‌ జట్టును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన ఆసీస్‌... ఛేదనలో ఎక్కడా తడబడలేదు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌ అదరగొట్టగా... బ్యాటింగ్‌లో మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌ ద్వయం చెలరేగింది. మెల్‌బోర్న్‌లో సోమవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయం అవుతుండగా, తమ అభిమానులకు తీపి వార్త అందించింది.

పాపం న్యూజిలాండ్‌... ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం చూసిన తర్వాత ఇలా స్పందించని క్రికెట్‌ అభిమాని ఉండడేమో! 2019 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఫైనల్‌ చేరి ‘బౌండరీ కౌంట్‌’తో గుండె పగిలిన కివీస్‌... ఈసారి టి20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ ఓడి విషాదంలో మునిగింది. 2015 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ చేతిలోనే ఓటమి పాలైన టీమ్‌... గత రెండేళ్ల వ్యవధిలో రెండు మెగా టోర్నీ తుది సమరాల్లోనూ దురదృష్టవశాత్తూ తలవంచింది. అసలు సమయంలో చెలరేగిన కెప్టెన్‌ విలియమ్సన్‌ 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి చుక్కానిలా జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించినా... ఇతర బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కివీస్‌ను దెబ్బ తీసింది. చివరకు మరోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.   

T20 World Cup 2021 Winner Australia: టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి తొలిసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌ టైటిల్‌ అందుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్‌ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ మార్‌‡్ష (50 బంతుల్లో 77 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు.  

బౌలర్ల జోరు...
భారీ స్కోరు సాధించేందుకు శుభారంభం చేయాల్సిన న్యూజిలాండ్‌ పవర్‌ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. 6 ఓవర్లలో 32 పరుగులే చేయగలిగిన ఆ జట్టు డరైల్‌ మిచెల్‌ (8 బంతుల్లో 11; సిక్స్‌) వికెట్‌ కోల్పోయింది. ముఖ్యంగా పేసర్‌ హాజల్‌వుడ్‌ ప్రత్యర్థిని కట్టి పడేశాడు. తన 3 ఓవర్ల స్పెల్‌లో అతను 14 ‘డాట్‌’ బంతులు వేయడం విశేషం. ఆసీస్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. విలియమ్సన్‌ బాగా నెమ్మదిగా ఆడగా, గప్టిల్‌ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) కూడా పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 57 మాత్రమే!

6 ఓవర్లలో 79 పరుగులు...
విరామం తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటికి 21 బంతులు ఆడిన విలియమ్సన్‌ 21 పరుగులతో ఉన్నాడు. స్టార్క్‌ వేసిన 11వ ఓవర్‌ నాలుగో బంతికి విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను హాజల్‌వుడ్‌ వదిలేశాడు. ఆ బంతికి ఫోర్‌ రాగా, తర్వాతి రెండు బంతులను కూడా కేన్‌ బౌండరీకి పంపించాడు. మరుసటి ఓవర్లో గప్టిల్‌ అవుటైనా... మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో కివీస్‌ కెప్టెన్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. జంపా ఓవర్లో ఫిలిప్స్‌ (17 బంతుల్లో 18; ఫోర్, సిక్స్‌) ఒక సిక్స్, ఫోర్‌ కొట్టగా... స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్లో విలియమ్సన్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 0, 4, 4 కొట్టడం విశేషం. 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన విలియమ్సన్‌... ఒక్క స్టార్క్‌ బౌలింగ్‌లోనే 12 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 39 పరుగులు రాబట్టాడు. అయితే కీలక సమయంలో విలియమ్సన్‌ను అవుట్‌ చేయడంతో పాటు చివరి నాలుగు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్‌... కివీస్‌ను కొంత వరకు కట్టడి చేయడంలో సఫలమైంది.  

భారీ భాగస్వామ్యం...
ఫామ్‌లో లేని కెప్టెన్‌ ఫించ్‌  (5) మరోసారి నిరాశపరుస్తూ ఆరంభంలోనే నిష్క్రమించడంతో ఆసీస్‌ ఛేదన మొదలైంది. అయితే వార్నర్, మార్ష్‌ భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. మిల్నే ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4తో తన ఖాతా తెరిచిన మార్ష్‌ చివరి వరకు అదే జోరును కొనసాగించగా, సెమీస్‌ తరహాలో మళ్లీ మెరుపు ప్రదర్శనతో వార్నర్‌ దూసుకుపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులు కాగా... సోధి ఓవర్లో వార్నర్‌ కొట్టిన 2 ఫోర్లు, సిక్స్‌తో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 82 పరుగులకు చేరింది. కివీస్‌ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు.ఎంతో నమ్ముకున్న స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధి కూడా పేలవంగా బౌలింగ్‌ చేయడంతో కంగారూలకు ఎదురు లేకుండా పోయింది.

ఆసీస్‌ దూసుకుపోతున్న సమయంలో లక్ష్యానికి 66 పరుగుల దూరంలో వార్నర్‌ను బౌల్డ్‌ చేసి బౌల్ట్‌ కొంత ఆశలు రేపాడు. అయితే నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 28 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాక్సీ అండతో మరింత చెలరేగిన మార్ష్‌ 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడిన మార్ష్‌ , మ్యాక్స్‌వెల్‌ 39 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సౌతీ వేసిన 19వ ఓవర్‌ ఐదో బంతిని రివర్స్‌ స్వీప్‌తో మ్యాక్స్‌వెల్‌ బౌండరీకి తరలించడంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది.  
 

ఇది చాలా పెద్ద విజయం. టి20 ప్రపంచకప్‌ నెగ్గిన తొలి ఆసీస్‌ జట్టు మాదే కావడం గర్వంగా ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌పై సాధించిన విజయం కీలక మలుపు. టీమ్‌ ప్రదర్శనతో పాటు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఈ గెలుపును అందించాయి. కొన్నాళ్ల క్రితం వార్నర్‌ను కొందరు లెక్కలోకి తీసుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. నా దృష్టిలో జంపా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ. అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.   
 –ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్‌

మేం సాధించిన స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ ఆసీస్‌ అద్భుతంగా ఆడి ఛేదించింది. ఈ రోజు మాకు కలిసి రాలేదు. అయితే మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. విజేతగా నిలవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో బాగా ఆడి ఎన్నో అంచనాలతో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి కొంత బాధ సహజం.     
–విలియమ్సన్, న్యూజిలాండ్‌ కెప్టెన్‌

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) స్టొయినిస్‌ (బి) జంపా 28; మిచెల్‌ (సి) వేడ్‌ (బి) హాజల్‌వుడ్‌ 11; విలియమ్సన్‌ (సి) స్మిత్‌ (బి) హాజల్‌వుడ్‌ 85; ఫిలిప్స్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హాజల్‌వుడ్‌ 18; నీషమ్‌ (నాటౌట్‌) 13, సీఫెర్ట్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172.  
వికెట్ల పతనం: 1–28; 2–76; 3–144; 4–148.
బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–60–0; హాజల్‌వుడ్‌ 4–0–16–3; మ్యాక్స్‌వెల్‌ 3–0–28–0; కమిన్స్‌ 4–0–27–0; జంపా 4–0–26–1; మిచెల్‌ మార్‌‡్ష 1–0–11–0.  

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) బౌల్ట్‌ 53; ఫించ్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 5; మార్‌‡్ష (నాటౌట్‌) 77; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 28; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 173.  
వికెట్ల పతనం: 1–15; 2–107.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–18–2; సౌతీ 3.5–0–43–0; మిల్నే 4–0–30–0; సోధి 3–0–40–0; సాన్‌ట్నర్‌ 3–0–23–0; నీషమ్‌ 1–0–15–0.  


ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ ట్రోఫీతో వార్నర్‌, విలియమ్సన్‌


మ్యాక్స్‌వెల్‌తో మిచెల్‌ మార్ష్‌ సంబరం
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2021
Nov 15, 2021, 07:30 IST
T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్‌ సహా ఒక్కో జట్టుకు ఎంత ముట్టిందంటే..
15-11-2021
Nov 15, 2021, 00:24 IST
T20 WC 2021: కొత్త చాంపియన్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ హర్షం.. వార్నర్‌పై ప్రశంసలు
14-11-2021
14-11-2021
Nov 14, 2021, 23:29 IST
Maxwell Swith Hit Winning Shot Became Viral.. టి20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే...
14-11-2021
Nov 14, 2021, 23:05 IST
సమయం: 23:00.. టి20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని 2...
14-11-2021
Nov 14, 2021, 22:08 IST
Kane Williamson Smash Mitchell Starc 22 Runs In Single Over.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్‌...
14-11-2021
Nov 14, 2021, 20:49 IST
Kane Williamson 2nd Captain To Score Half Century T20 WC Finals.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో...
14-11-2021
Nov 14, 2021, 19:12 IST
Team Captain Who Stands Title Left Side Won Final Match.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌...
14-11-2021
Nov 14, 2021, 17:37 IST
David Warner Waiting For 2 Milestones Vs NZ Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో...
14-11-2021
Nov 14, 2021, 16:51 IST
Toss Winning Team Won T20 World Cup 2021 Title.. టి20 ప్రపంచకప్‌ 2021 ఆఖరి అంకానికి చేరుకుంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు మరికొద్ది...
14-11-2021
Nov 14, 2021, 12:18 IST
Daryl Mitchell to replace Devon Conway: టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కీవిస్‌...
14-11-2021
Nov 14, 2021, 11:34 IST
Sunil Gavaskar picks his favourite team to lift famous trophy: టీ20 ప్రపంచకప్‌2021లో తుది పోరుకు సమయం అసన్నమైంది....
14-11-2021
Nov 14, 2021, 07:48 IST
ఐదు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచినా కూడా... ఆరు ప్రయత్నాల్లోనూ టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌ కాలేకపోయిన జట్టు ఒకవైపు... రెండు పరిమిత...
13-11-2021
Nov 13, 2021, 20:38 IST
వేడ్‌కు భయంకర వార్త అతనికి తెలుస్తుంది. అదే అతడు  క్యాన్సర్‌ బారిన పడ్డాడని
13-11-2021
Nov 13, 2021, 18:49 IST
టీమిండియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌గా యువరాజ్‌ సింగ్‌ సేవలు ఎప్పటికి మరిచిపోము. తొలి టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌...
13-11-2021
Nov 13, 2021, 16:23 IST
Indian doctor who treated Mohammad Rizwan: టీ20 ప్రపంచకప్‌-2021లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. టోర్నీ లీగ్‌ దశలో...
13-11-2021
Nov 13, 2021, 16:10 IST
Kevin Pieterson Predicts Winner Of T20 World Cup 2021: టి20 ప్రపంచకప్‌ 2021 విజేతపై ఇంగ్లండ్‌ మాజీ...
13-11-2021
Nov 13, 2021, 15:17 IST
Tim Seifert Replace Devon Conway For T20 WC 2021 Final.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య...
13-11-2021
Nov 13, 2021, 13:54 IST
Wasim Jaffer tweets a funny meme on Kohli and Kane Williamson.. టి20 ప్రపంచకప్‌ 2021 ఫైనల్‌ నేపథ్యంలో...
13-11-2021
Nov 13, 2021, 11:44 IST
అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా కానీ... 

Read also in:
Back to Top