ఆసీస్‌తో తొలి టి20లో టీమిండియా ఓటమి

Australia Beat India In First T20 - Sakshi

4 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం

గెలిపించిన గ్రీన్, వేడ్‌

రెండో వన్డే శుక్రవారం 

ఆస్ట్రేలియాపై టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆనందం భారత్‌కు దక్కలేదు. హార్దిక్, కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్‌ దూకుడైన బ్యాటింగ్‌తో 208 పరుగులు సాధించినా అవి విజయానికి సరిపోలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, వేగవంతమైన అవుట్‌ ఫీల్డ్‌పై అదే రీతిలో జవాబిచ్చిన ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఆరంభంలో గ్రీన్, చివర్లో వేడ్‌ చెలరేగి ఆ జట్టుకు సిరీస్‌లో ఆధిక్యాన్ని అందించారు. ఇద్దరు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, హర్షల్‌ కలిపి ఒక్క వికెట్‌ తీయకుండా 8 ఓవర్లలో 101 పరుగులు ఇవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. తాజా మ్యాచ్‌ ఫలితం ప్రపంచకప్‌కు ముందు భారత్‌ సరిదిద్దుకోవాల్సిన లోపాలను గుర్తు చేసింది.   

మొహాలి: భారత్‌పై టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కామెరాన్‌ గ్రీన్‌ (30 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ వేడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం నాగపూర్‌లో జరుగుతుంది.  

రాహుల్‌ అర్ధ సెంచరీ... 
భారత్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా ప్రారంభమైనా... తక్కువ వ్యవధిలోనే రోహిత్‌ (11), కోహ్లి (2) వెనుదిరిగారు. అయితే మరో ఎండ్‌లో రాహుల్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. తన స్ట్రయిక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు సమాధానాలివ్వాలనే కసి అతనిలో కనిపించింది. సూర్యకుమార్‌ కూడా తనదైన శైలిలో మెరుపు షాట్లు ఆడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. పవర్‌ప్లేలో భారత్‌ 46 పరుగులు చేయగా, 10 ఓవర్లలో స్కోరు 86 పరుగులకు చేరింది. 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్‌ ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో 2 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.

అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరగ్గా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్‌ త్రుటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ భారీ స్కోరు సాధించగలిగింది. చివరి 7 ఓవర్లలో భారత్‌ 89 పరుగులు సాధించగా, ఇందులో హార్దిక్‌ ఒక్కడే 69 పరుగులు చేయడం విశేషం. హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 ఫోర్లు, కమిన్స్‌ ఓవర్లో 6, 4 కొట్టిన అతను 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో చివరి 3 బంతులను అతను వరుసగా 6, 6, 6 బాది ఘనంగా ఇన్నింగ్స్‌ను ముగించాడు. టి20ల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గాయం నుంచి కోలుకున్న బుమ్రాను ముందు జాగ్రత్తగా భారత్‌ ఈ మ్యాచ్‌లో ఆడించలేదు.  

వేడ్‌ మెరుపులు... 
భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలచిన ఆరోన్‌ ఫించ్‌ (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అతని మలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టాడు. మరోవైపు మూడున్నరేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడిన ఉమేశ్‌ యాదవ్‌ తన తొలి ఓవర్లోనే గ్రీన్‌కు నాలుగు ఫోర్లు సమర్పించుకున్నాడు. ఫించ్‌ను అవుట్‌ చేసి అక్షర్‌ ప్రత్యర్థి జోరుకు బ్రేక్‌ వేసినా... గ్రీన్, స్మిత్‌ భాగస్వామ్యం (40 బంతుల్లో 70 పరుగులు) ఆసీస్‌ను విజయం వైపు నడిపించింది. అక్షర్, రాహుల్‌ చెరో క్యాచ్‌ వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. చహల్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టిన గ్రీన్, అక్షర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

10 ఓవర్లలో స్కోరు 109 పరుగులకు చేరింది. విజయానికి 60 బంతుల్లో 109 పరుగులు చేయాల్సి ఉండగా, 14 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి భారత్‌ కాస్త ఒత్తిడి పెంచింది. గ్రీన్‌ను అక్షర్‌ అవుట్‌ చేయగా... ఉమేశ్‌ ఒకే ఓవర్లో స్మిత్, మ్యాక్స్‌వెల్‌ (1)లను వెనక్కి పంపాడు. ఈ రెండు నిర్ణయాలు డీఆర్‌ఎస్‌ ద్వారానే భారత్‌కు అనుకూలంగా రాగా, ఇన్‌గ్లిస్‌ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే వేడ్‌ మెరుపు బ్యాటింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భువీ ఓవర్లో రెండు ఫోర్ల తర్వాత హర్షల్‌ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అతను... భువీ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఆసీస్‌ గెలుపు ఖాయమైంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

స్కోరు వివరాలు... 
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ఎలిస్‌ (బి) హాజల్‌వుడ్‌ 55; రోహిత్‌ (సి) ఎలిస్‌ (బి) హాజల్‌వుడ్‌ 11; కోహ్లి (సి) గ్రీన్‌ (బి) ఎలిస్‌ 2; సూర్యకుమార్‌ (సి) వేడ్‌ (బి) గ్రీన్‌ 46; హార్దిక్‌ (నాటౌట్‌) 71; అక్షర్‌ (సి) గ్రీన్‌ (బి) ఎలిస్‌ 6; కార్తీక్‌ (ఎల్బీ) (బి) ఎలిస్‌ 6; హర్షల్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–21, 2–35, 3–103, 4–126, 5–146, 6–176.
బౌలింగ్‌: హాజల్‌వుడ్‌ 4–0–39–2, కమిన్స్‌ 4–0–47–0, జంపా 4–0–36–0, ఎలిస్‌ 4–0–30–3, గ్రీన్‌ 3–0–46–1, మ్యాక్స్‌వెల్‌ 1–0–10–0.  

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: ఫించ్‌ (బి) అక్షర్‌ 22; గ్రీన్‌ (సి) కోహ్లి (బి) అక్షర్‌ 61; స్మిత్‌ (సి) కార్తీక్‌ (బి) ఉమేశ్‌ 35; మ్యాక్స్‌వెల్‌ (సి) కార్తీక్‌ (బి) ఉమేశ్‌ 1; ఇన్‌గ్లిస్‌ (బి) అక్షర్‌ 17; టిమ్‌ డేవిడ్‌ (సి) హార్దిక్‌ (బి) చహల్‌ 18; వేడ్‌ (నాటౌట్‌) 45; కమిన్స్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–39, 2–109, 3–122, 4–123, 5–145, 6–207. 
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–52–0, ఉమేశ్‌ యాదవ్‌ 2–0–27–2, అక్షర్‌ పటేల్‌ 4–0–17–3, చహల్‌ 3.2–0–42–1, హర్షల్‌ పటేల్‌ 4–0–49–0, హార్దిక్‌ పాండ్యా 2–0–22–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top