సంయుక్త ఆధిక్యంలో అర్జున్‌ | Arjun in joint lead at World Rapid Chess Championship | Sakshi
Sakshi News home page

సంయుక్త ఆధిక్యంలో అర్జున్‌

Dec 29 2024 4:20 AM | Updated on Dec 29 2024 4:20 AM

Arjun in joint lead at World Rapid Chess Championship

న్యూయార్క్‌: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. శనివారం తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి రష్యా గ్రాండ్‌మాస్టర్లు వొలొడర్‌ ముర్జిన్, అలెగ్జాండర్‌ గ్రిస్చుక్, జాన్‌ క్రిజ్‌స్టొఫ్‌ (పోలండ్‌)లతో కలిసి భారత ఆటగాడు ఏడు పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నాడు. 13 రౌండ్ల ఈ ర్యాపిడ్‌ ఈవెంట్‌లో ఇంకా నాలుగు గేములు మిగిలున్నాయి. 

డ్రస్‌కోడ్‌ ఉల్లంఘనతో కార్ల్‌సన్‌పై చర్య దరిమిలా అతను టోర్నీ నుంచి తప్పుకోవడంతో అర్జున్‌ ఒక్కడే ఆధిక్యంలో నిలిచే అవకాశాలు కాస్త మెరుగయ్యాయి. శనివారం జరిగిన నాలుగు రౌండ్లలో (6, 7, 8, 9) రెండు విజయాలు, రెండు డ్రాలతో అర్జున్‌ సత్తాచాటుకున్నాడు. ఆరో రౌండ్లో అమెరికా ఆటగాడు రాబ్సన్‌ రేను కంగుతినిపించిన అర్జున్‌ మరుసటి గేమ్‌లో శాంట్‌ సర్గియాన్‌ (ఆర్మేనియా)పై గెలిచాడు. 

తర్వాత 8, 9వ రౌండ్లలో వరుసగా ముర్జిన్‌ (రష్యా), క్రిజ్‌స్టొఫ్‌ (పోలండ్‌)లతో గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. ఆదివారం జరిగే పదో రౌండ్‌ గేమ్‌లో తెలంగాణ ఆటగాడు రష్యాకు చెందిన గ్రిస్చుక్‌తో తలపడతాడు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలు కూడా సంయుక్త ఆధిక్యంలోకి దూసుకొచ్చారు.

హంపి ఒక గేమ్‌లో ఓడి తర్వాత వరుసగా నాలుగు గేమ్‌ల్లో గెలిచింది. తద్వారా 9 రౌండ్లు ముగిసేసరికి సహచర క్రీడాకారిణి హారిక, వెన్‌జున్‌ జు (చైనా)లతో కలిసి 6.5 పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement