53 బంతుల్లోనే...  | Indian womens cricket team beat Zimbabwe by nine wickets | Sakshi
Sakshi News home page

53 బంతుల్లోనే... 

Oct 19 2026 5:33 AM | Updated on Oct 19 2026 5:33 AM

Indian womens cricket team beat Zimbabwe by nine wickets

103 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు

రెండో టి20లో 9 వికెట్ల తేడాతో జింబాబ్వే ఓటమి

2–0తో సిరీస్‌ టీమిండియా సొంతం

షఫాలీ వర్మ, స్మృతి మెరుపులు  

రాయ్‌పూర్‌: జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లో ఆధిపత్యం కనబర్చలేకపోయిన భారత మహిళల టి20 క్రికెట్‌ జట్టు రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో పోరులో స్మృతి మంధాన సారథ్యంలోని టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

స్మృతి మంధానకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఇది తొలి సిరీస్‌ విజయం. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. చిపో ముగెరి తిరిపానో (32 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ జోసెఫిన్‌ ఎనోమో (35 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. ఈ ఇద్దరు మినహా తక్కినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

భారత బౌలర్లలో గత మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన నికీ ప్రసాద్‌ 2 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా... క్రాంతి గౌడ్, నందని శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌ 8.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 104 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (25 బంతుల్లో 55; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్మృతి మంధాన (25 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం నామమాత్రమైన మూడో మ్యాచ్‌ జరగనుంది.  

బాదుడే బాదుడు...  
గత మ్యాచ్‌లో విఫలమైన టాపార్డర్‌ ఈ సారి దంచికొట్టింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఫోర్‌ కొట్టిన షఫాలీ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించింది. మొదటి ఓవర్‌లో 4, 6 కొట్టిన షఫాలీ... రెండో ఓవర్‌లో ఓ ఫోర్‌ బాదింది. మూడో ఓవర్‌లో స్మృతి రెండు ఫోర్లతో లైన్‌లోకి రాగా... నాలుగో ఓవర్‌లో షఫాలీ 6, 4తో ఆకట్టుకుంది. గ్వాన్‌జురా వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో స్మృతి వరుసగా 4, 4, 4, 4 కొట్టగా... చివరి బంతికి షఫాలీ కూడా ఫోర్‌ బాదింది. 

దీంతో ఆ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్‌లో షఫాలీ వరుసగా 4, 4, 6 దంచడంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి టీమిండియా 76/0తో నిలిచింది. ఈ క్రమంలో మరో భారీ సిక్స్‌తో షఫాలీ 24 బంతుల్లో తన 22వ  టి20 అర్ధశతకం పూర్తి చేసుకుంది. ఆ వెంటనే తను అవుటైనా చక్కటి సిక్స్‌తో స్మృతి మ్యాచ్‌ను ముగించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 బంతుల్లోనే 96 పరుగులు జోడించడం విశేషం.  

స్కోరు వివరాలు 
జింబాబ్వే ఇన్నింగ్స్‌: కెలిస్‌ (బి) నందని 0; బిజా (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తి 7; తిరిపానో (సి) రిచా (బి) నికీ 34; మాయర్స్‌ (సి) దీప్తి (బి) క్రాంతి 9; జోసెఫిన్‌ (నాటౌట్‌) 27; గ్వాన్‌జురా (ఎల్బీ) (బి) నికీ 0; ముపాచిక్వా (రనౌట్‌) 9; మావుంగా (సి) నికీ (బి) శ్రీచరణి 4; ఫ్రాన్సిస్కా (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 102. 
వికెట్ల పతనం: 1–10, 2–20, 3–30, 4–75, 5–75, 6–94, 7–99, 8–102. 
బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 4–0–15–1; నందని శర్మ 3–0–17–1; దీప్తి శర్మ 3–0–13–1; అరుంధతి రెడ్డి 3–0–17–0; శ్రీచరణి 4–0–21–1; షఫాలీ 1–0–7–0; నికీ ప్రసాద్‌ 2–0–7–2.  

భారత ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) మకూషా (బి) బిజా 55; స్మృతి (నాటౌట్‌) 47; అనుష్క (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (8.5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి) 104. 
వికెట్ల పతనం: 1–96. 
బౌలింగ్‌: గ్వాన్‌జురా 3–0–42–0; మకూషా 2–0–19–0; మవుంగా 1–0–15–0; చేర్‌ 1.5–0–19–0; బిజా 1–0–9–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement