వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో ఈసారి స్వర్ణం సాధిస్తా
చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ రజతం సంతృప్తినిచ్చింది
కృషి, అంకితభావంతోనే ఏ ఆటలోనైనా రాణించొచ్చు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో చెస్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్
భారత చెస్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్... ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది చదరంగంలో అడుగు పెట్టారు. ఆనంద్ కూడా ఆనందపడేలా విజయాలు సాధించే స్థాయికి చేరుకుంటున్నారు. ఆనంద్‌కు కూడా సాధ్యంకాని రీతిలో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈ యువ గ్రాండ్‌మాస్టర్లు తమ సత్తా చాటుకొని భారత్ చెస్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. భారత చెస్‌కు వన్నెలద్దుతున్న యువ గ్రాండ్‌మాస్టర్ల జాబితాలో కీలకమైన ప్లేయర్‌గా ఎదిగిన వారిలో ఇరిగేశి అర్జున్ పేరు తప్పకుండా ఉంటుంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన 23 ఏళ్ల అర్జున్ ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు రజత పతకం గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
తెలంగాణ నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న అర్జున్ 2024 డిసెంబర్లో 2800 ఎలో రేటింగ్‌ను కూడా దాటాడు. ప్రపంచ చెస్‌లో 2800 ఎలో రేటింగ్‌ను కేవలం 15 మంది మాత్రమే దాటగా... విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి ఈ మైలురాయిని అందుకున్న రెండో చెస్ ప్లేయర్ అర్జున్ కావడం విశేషం. 2024 చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న అర్జున్... అదే జోరును కొనసాగించి 2026 చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తన స్వస్థలం హనుమకొండకు వచ్చిన సందర్భంగా అర్జున్ ఒలింపియాడ్ విశేషాలను, తన భవిష్యత్ ప్రణాళికలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. –వాంకె శ్రీనివాస్ (సాక్షి, వరంగల్)
రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు చెస్ ప్రాక్టీసు
వైద్యుల కుటుంబం: నాన్న డాక్టర్ శ్రీనివాసరావు (న్యూరో సర్జన్). అమ్మ జ్యోతి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్. అక్క కీర్తన ఎంబీబీఎస్ పూర్తి చేశారు. చెస్ వైపు అడుగులు: చిన్నతనంలో స్విమ్మింగ్, స్కేటింగ్ లాంటివి ఆడినా చెస్ పైనే ఎక్కువ ఆసక్తి పెరిగింది.
కఠోర సాధన: ప్రతిరోజు 6 నుండి 8 గంటల పాటు కేవలం చెస్ ప్రాక్టీస్‌కే పరిమితం.
ఫిట్నెస్ మంత్రం: 7–8 గంటల లాంగ్ గేమ్స్‌లో చివరివరకు అదే ఏకాగ్రత కాపాడుకోవడానికి రోజుకు గంట నుండి గంటన్నర జిమ్‌లో వ్యాయామం.
ఒత్తిడి నివారణ: మ్యాచ్‌ల్లో కఠిన పరిస్థితులను తట్టుకోవడానికి శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం చేయడం.
చెస్ ప్లేయర్‌గా మీ ప్రత్యేక బలం ఏమిటి?
నా టైమ్ మేనేజ్మెంట్ నా ప్రత్యేకత అని భావిస్తాను. చాలామంది తీవ్రమైన సమయాభావానికి గురవుతారు. మరికొందరు సమయం తక్కువగా ఉందని చాలా వేగంగా ఆడి తప్పులు చేస్తారు. నేను టైమ్ ప్రెషర్‌కు గురవ్వను. అదే సమయంలో అతి వేగంగా ఆడి తప్పులు కూడా చేయను. సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయగలగడం నా బలంగా భావిస్తాను.
టీమ్ వాతావరణం ఎలా ఉంటుంది?
గుకేశ్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, విదిత్ గుజరాతీ... మేమంతా దాదాపు ఒకే వయసుకు చెందిన వాళ్లం. అందరి మధ్య మంచి పరిచయం, టీమ్ బాండింగ్ ఉంది. కెప్టెన్, సెకండ్స్, విదిత్తోనూ చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. టీమ్ మీటింగ్స్‌లో కూడా జోక్స్ వేసుకుంటూ సరదాగా గడుపుతాం. ఇలాంటి మంచి వాతావరణం ఉన్నప్పుడు విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒక గేమ్‌లో ఓడిపోయాక తదుపరి గేమ్‌లకు ఎలా సిద్ధమవుతారు?
చెస్ ప్లేయర్‌కైనా, ఏ క్రీడాకారుడికైనా ఓడిపోయిన తర్వాత వెంటనే కోలుకోవడం చాలా కష్టమైన విషయం. నా ప్రారంభ రోజుల్లో ఒక మ్యాచ్‌లో ఓడిపోతే దాని ప్రభావం తర్వాతి గేమ్‌పై పడేది. కానీ గత మూడు, నాలుగు సంవత్సరాలుగా వచ్చిన అనుభవం వల్ల ఇప్పుడు నన్ను నేను సరిగ్గా తడబాటు లేకుండా ఆడగలుగుతున్నా. మెడిటేషన్ వంటి పద్ధతులు కూడా అందుకు సహాయపడుతున్నాయి.
భారత చెస్‌లో యువతకు అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటి?
మొదటగా విశ్వనాథన్ ఆనంద్ సర్ ఒక గొప్ప ప్రేరణగా ఉండటం వల్ల ఎక్కువ మంది చెస్‌ను ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఏదైనా దేశం ఒక క్రీడలో బాగా రాణిస్తే, ఆ క్రీడపై ఆసక్తి పెరుగుతుంది. దాంతో టోర్నమెంట్లు, అవకాశాలు కూడా పెరుగుతాయి.
మీ ముందున్న అతిపెద్ద లక్ష్యం?
ఒకప్పుడు వరల్డ్ చాంపియన్ అయితే ఆటోమేటిక్‌గా వరల్డ్ నంబర్‌వన్ అయినట్టే ఉండేది. కానీ గత మూడేళ్లుగా పరిస్థితులు మారాయి. ఇప్పుడు వరల్డ్ చాంపియన్ అయినా నంబర్‌వన్‌గా ఉండటం తప్పనిసరి కాదు. అందుకే వరల్డ్ నంబర్‌వన్ కావడం మరింత విలువైనదిగా నేను భావిస్తున్నాను. నా ప్రధాన లక్ష్యం ప్రపంచ నంబర్‌వన్ కావడమే. అలాగే ప్రతి డిసెంబర్లో జరిగే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో గతంలో నాకు కాంస్య పతకం వచ్చింది. ఈసారి స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను.
చెస్ ఒలింపియాడ్ టోర్నీ ఫలితాలు, మీ వ్యక్తిగత ప్రదర్శనపై మీరేమంటారు?
దీన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. గతంలో స్వర్ణ పతకం సాధించాం. ఈసారి రజత పతకం రావడంతో కొంత తగ్గినట్లు అనిపించినా... గతంతో పోలిస్తే ఈసారి పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఉజ్బెకిస్తా¯న్Œ జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. నా వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే.. ప్రారంభంలో కొంత తడబడినా... చివర్లో కీలకమైన గేమ్‌లలో గెలవడం సంతోషాన్నిచ్చింది. టోర్నీ ఆరంభంలో మూడు, నాలుగు గేమ్‌లలో గెలిచే స్థితి నుంచి ‘డ్రా’గా ముగిసిన సందర్భాలున్నాయి. అందుకే చివరి గేమ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని నిర్ణయించుకున్నాను. జట్టుకు ఆ విజయం చాలా అవసరం. దీంతో పూర్తి ఏకాగ్రతతో, షార్ప్‌గా, అలర్ట్‌గా ఆడి విజయాన్ని ఖాయం చేశాను.
కీలక సందర్భాల్లో ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు?
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా మా జట్టులో ఆటగాళ్ల మధ్య మంచి అనుబంధం, సానుకూల వాతావరణం ఉంది. ఉదాహరణకు నిహాల్ మధ్యలో కొన్ని గేమ్‌లు కోల్పోయినా, జట్టు మద్దతుతో వెంటనే కోలుకుని తర్వాతి రౌండ్లలో కీలక విజయాలు సాధించాడు. ఒక జట్టుగా కలిసి ఉండటం ఒత్తిడిని అధిగమించడంలో ఎంతో సహాయపడుతుంది.
తెలంగాణ చెస్ చిన్నారులకు మీరు ఇచ్చే సందేశం?
కృషి, అంకితభావం చాలా ముఖ్యమైనవే. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఆ ఆటపై అభిరుచి ఉండటం, దాన్ని ఆస్వాదించడం. అది చెస్ అయినా, బ్యాడ్మింటన్ అయినా, మరేదైనా క్రీడ అయినా సరే పిల్లలు ఆ ఆటను ఆస్వాదిస్తే కృషి, అంకితభావం అనేవి వాటంతటఅవే ఆటోమేటిక్‌గా వస్తాయి.


