Anrich Nortje: తెలివైన క్రికెటర్‌.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్‌ వేరయా'

Anrich Nortje Takes Stunning Catch Dismiss Batter SA Vs WI 1st T20 - Sakshi

సౌతాఫ్రికా బౌలర్‌ అన్‌రిచ్‌ నోర్ట్జే తెలివైన క్యాచ్‌ అందుకున్నాడు. బహుశా క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌లు అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్‌ పట్టే క్రమంలో బ్యాలెన్స్‌ తప్పితే బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్‌ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్‌లు తీసుకోవడం చూస్తుంటాం.

కానీ నోర్ట్జే కాస్త కొత్తగా, తెలివిగా ఆలోచించాడు. బ్యాటర్‌ బంతిని బారీ షాట్‌ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్జ్టే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్‌గా నోర్ట్జే తీసుకున్న క్యాచ్‌కు క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. నోర్ట్జే ఆలోచన కాస్త కొత్తగా ఉండడంతో ''క్యాచ్‌లందు ఈ క్యాచ్‌ వేరయా'' అన్న క్యాప్షన్‌ సరిగ్గా సరిపోతుందని అభిమానులు పేర్కొన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో డేవిడ్‌ మిల్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి.  విండీస్‌ బౌలర్లలో కాట్రల్‌, స్మిత్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్‌, హోస్సేన్‌, షెపర్డ్ చెరో వికెట్‌ సాధించారు.

అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో  బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్‌ కెప్టెన్‌ రోవమన్‌ పావెల్‌(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్‌ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్‌ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

చదవండి: బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా

నెదర్లాండ్స్‌ కలను నాశనం చేసిన జింబాబ్వే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top