SA Vs WI: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్‌; సిరీస్‌ విండీస్‌దే

West Indies Won-By 7 Runs Vs SA Clinch T20 Series 2-1-After 8 Years - Sakshi

టి20 క్రికెట్‌లో మ్యాచ్‌ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించరు. ఓవర్‌ ఓవర్‌కు ఫలితాలు మారుతాయి కాబట్టే పొట్టి క్రికెట్‌కు అంత ఆదరణ దక్కింది. కొన్ని జట్లు ఒక్క పరుగుతో ఓడిపోయిన సందర్భాలు చూసే ఉంటారు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌లో పరుగుల పండగ చేసుకున్న జట్టు.. ఆ ఓవర్‌లో వచ్చిన పరుగులతోనే మ్యాచ్‌ విజయాన్ని శాసించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఫీట్‌ సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మూడో టి20లో నమోదైంది. 

మంగళవారం జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మూడో టి20లో సౌతాఫ్రికా ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటిస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్‌(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌కు తోడుగా.. ఐడెన్‌ మార్ర్కమ్‌ 18 బంతుల్లో 35 నాటౌట్‌ రాణించినప్పటికి సౌతాఫ్రికాను గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ ఐదు వికెట్లతో రాణించాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. తొలుత బ్రాండన్‌ కింగ్‌ 25 బంతుల్లో 36, నికోలస్‌ పూరన్‌ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్‌ 22 బంతుల్లో 44 పరుగులు నాటౌట్‌, అల్జారీ జోసెఫ్‌ 9 బంతుల్లో 14 నాటౌట్‌ విధ్వంసం సృష్టించారు.

ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు..
19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. స్ట్రైక్‌ తీసుకున్న షెపర్డ్‌ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన షెపర్డ్‌ వరుసగా నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు రావడంతో ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి.

చిత్రంగా వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు బాదితే.. టార్గెట్‌లో సౌతాఫ్రికాకు ఆఖరి ఓవర్‌లో అదే 26 పరుగులు అవసరం అయ్యాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌ కాబట్టి ఒత్తిడి ఉండదు.. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి ప్రొటిస్‌ విజయాన్ని దెబ్బతీసింది.ఈ విజయంతో వెస్టిండీస్‌ 2-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్‌ జట్టు టి20 సిరీస్‌ను గెలవడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్‌ నిలవగా.. జాన్సన్‌ చార్లెస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

చదవండి: చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top