P.T Usha: బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా

Inspirational Story About PT Usha In Funday - Sakshi

దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందటి మాట.. పయ్యోలి బీచ్‌లో ఆ అమ్మాయి పరుగు తీస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. ఆమె ఎటు వైపు వెళితే అటు వైపు వారు ఆమెను అనుసరించేవారు. కొందరు చిన్న పిల్లలయితే ఆట పట్టించేవారు కూడా. షార్ట్స్‌లో ఒకమ్మాయి పరుగెత్తడం అదో వింతగా అనిపించింది. అసలు ఆ సమయంలో ఎవరూ క్రీడలను సీరియస్‌గా పట్టించుకోనేలేదు. తర్వాతి రోజుల్లో ఆ అమ్మాయి భారత అథ్లెటిక్స్‌కు కొత్త దారి చూపించింది.

ఎవరూ అందుకోలేని రీతిలో చిరస్మరణీయ ఘనతలు నమోదు చేసింది. దాదాపు ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో స్ప్రింటర్‌గా, హర్డ్‌లర్‌గా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీనేజర్లు దూసుకొచ్చిన సమయంలోనూ 35 ఏళ్ల వయసులో కొత్త జాతీయ స్ప్రింట్‌ రికార్డును నెలకొల్పగలిగింది. అంటే ఆ ప్లేయర్‌ సత్తాను అర్థం చేసుకోవచ్చు. ఆ స్టార్‌ పేరే పిళవుళకంది తెక్కెరపరంబిల్‌ ఉష.. అందరికీ తెలిసిన పీటీ ఉష. పరుగెత్తుతూ కనిపించిన ప్రతి అమ్మాయికి ఒక దశలో సర్వనామంగా మారిపోయిన పేరు. 

అథ్లెటిక్స్‌లో ప్రతిభావంతులను గుర్తించడంలో కోచ్‌ మాధవన్‌ నంబియార్‌కు మంచి పేరుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన ఆయన వద్ద క్రమశిక్షణ కూడా అదే తరహాలో ఉండేది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిలో అపార, సహజ ప్రతిభ ఉందని గుర్తించాడు. దానికి తన శిక్షణ, క్రమశిక్షణ తోడైతే అద్భుతాలు సాధించవచ్చని గ్రహించాడు. నిజంగా కూడా అదే జరిగింది. ఆయన ఎంపిక చేసిన పీటీ ఉష ఆయన అంచనాను వాస్తవంగా మార్చింది.

నంబియార్‌–ఉషల కోచ్‌–ప్లేయర్‌ జోడీ సూపర్‌ సక్సెస్‌గా నిలిచింది. ఆ సమయంలో ఉష వయసు తొమ్మిదేళ్లు. పాఠశాలలో జరిగిన రన్నింగ్‌ రేస్‌లో తనకంటే మూడేళ్లు పెద్ద అయిన సహచర విద్యార్థులను అలవోకగా ఓడించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రాబోయే కొన్నేళ్లలో ఈ అమ్మాయి దేశం గర్వించదగ్గ అథ్లెట్‌ అవుతుందన్న విషయం అప్పుడు ఎవరికీ తెలీదు.

కానీ కొద్ది రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ స్కూల్‌ మొదటి మ్యాచ్‌లో చేరిన ఉష రివ్వుమని దూసుకుపోయింది. కోళికోడ్‌ జిల్లా కూతలిలో పుట్టిన ఉష ఆ తర్వాత సమీపంలోనే పయ్యోలిలో స్థిర పడింది. అక్కడి నుంచే అగ్రస్థానానికి ఎదిగిన ఆమె ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో తన పేరుకు, ఊరి పేరుకు శాశ్వత కీర్తిని కల్పించుకుంది. అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు ఎన్ని అందుకున్నా ఏనాడూ వివాదంగా మారకుండా, దరిచేరనివ్వకుండా అందరికీ ఆత్మీయురాలిగా, స్ఫూర్తిగా నిలుస్తూనే ఆమె కెరీర్‌ను ముగించింది. 

అలా మొదలు..
రాష్ట్రస్థాయి విజయాల తర్వాత ఉష ఆట స్థాయి మరింత పెరిగింది. 14 ఏళ్ల వయసులో ఇంటర్‌ స్టేట్‌ జూనియర్‌ మీట్‌లో పాల్గొన్న ఉష 4 స్వర్ణ పతకాలు గెలుచుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసింది. కేరళ కాలేజ్‌ మీట్‌లోనైతే ఏకంగా 14 పతకాలు ఆమె ఖాతాలో చేరాయంటే ఆధిపత్యం ఎలాంటిదో ఊహించవచ్చు. మరో ఏడాది తర్వాత జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణాలతో ఉష మెరిసింది.

ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏ పోటీలు ఉన్నా సరే.. అది ఇంటర్‌ స్టేట్‌ మీట్‌ కానీ, ఓపెన్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ కానీ.. అథ్లెట్లు ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే ఉష ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఉష సన్నిహితులు, కోచ్‌లు ఎట్టకేలకు ఎదురు చూసిన క్షణం 1980లో వచ్చింది. మాస్కో ఒలింపిక్స్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో 16 ఏళ్ల ఉషకు చోటు దక్కింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో 100 మీటర్ల పరుగులో ఉష ఫైనల్స్‌కు చేరడంలో విఫలమైనా.. తొలి ఒలింపిక్స్‌లో తగినంత అనుభవాన్ని ఆమె దక్కించుకుంది. 

ఆసియా క్వీన్‌గా..
అంతర్జాతీయ వేదికపై ఉష గొప్పగా చెప్పుకోగలిగే తొలి విజయం 1983లో వచ్చింది. 19 ఏళ్ల వయసులో అమితోత్సాహంతో  ఆసియా చాంపియన్‌షిప్‌ (కువైట్‌ సిటీ)లో పాల్గొన్న ఉష 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకంతో మెరిసింది. అది మొదలు 1998 (ఫుకోకా) వరకు దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో ఉష హవా కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఆమె ఈ ఈవెంట్‌లో ఏకంగా 14 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం.

దీంతో పాటు మరో 6 రజతాలు, 3 కాంస్యాలు కూడా సాధించడంలో ఉష సఫలమైంది. మొత్తం 23 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఆమె నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఉష పతకాలు గెలుచుకోవడంలో సఫలమైంది. కెరీర్‌ ఆరంభ దశలో 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజత పతకాలు సాధించి ఉష ఆసియా వేదికపై మొదటి సారి తన ముద్రను చూపించింది. 

1990 బీజింగ్‌ ఆసియా క్రీడల్లో మూడు రజతాలు గెలుచుకున్న ఉష.. కెరీర్‌ చివర్లో 1994 హిరోషిమా ఏషియాడ్‌లో కూడా మరో రజతాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే వీటన్నింటినీ మించి ఉష పేరును భారత్‌లో ఇంటింటికీ చేర్చిన ఘనత, అథ్లెటిక్స్‌లో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన ఘట్టం 1986 సియోల్‌ ఆసియా క్రీడలే. ఈ పోటీల్లో ఉష ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించి సంచలనం సృష్టించింది. 200 మీ., 400 మీ. పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్, 4X400 మీ. రిలేలో ఆమె పరుగు పసిడి కాంతులు అందించింది. 100 మీటర్ల పరుగులో త్రుటిలో స్వర్ణం చేజారగా వచ్చిన రజతంతో ఐదో పతకం ఉష మెడలో వాలింది. 

ముగింపు ప్రస్థానం..
లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ప్రదర్శనను మరో నాలుగేళ్ల తర్వాత 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో ఉష పునరావృతం చేయలేకపోయింది. ఆ తర్వాత వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 1990లోనే ఆమె రిటైర్మెంట్‌ ప్రకటించింది. అయితే కబడ్డీ మాజీ ఆటగాడైన భర్త శ్రీనివాసన్‌ ప్రోత్సాహంతో మళ్లీ ప్రాక్టీస్‌ చేసి ట్రాక్‌పై అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలతో తనేంటో చూపించింది. చివరకు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందు ఆటకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పింది. ఒలింపిక్స్‌ పతకం మినహా  తాను అన్నీ సాధించానని, వాటితో సంతృప్తి చెందానని ఉష వెల్లడించింది. 
 
సెకన్‌ లో 1/100 వంతు తేడాతో..
ఉష కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని క్షణం 1984 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో వచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ఒక వైపు ఆనందం, మరో వైపు బాధ కలగలిసిన సమయం అది. ఆ సమయంలో ఉష అత్యుత్తమ ఫామ్‌లో, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉంది. ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం ఖాయం అనిపించింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో 55.42 సెకన్లతో ఆమె భారత్‌ తరఫున అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసింది. అయితే సెకనులో వందో వంతు తేడాతో కాంస్యపతకం చేజారింది.

ఫాల్స్‌ స్టార్ట్‌ చేసినా దానిని అధిగమించి చివరి 100 మీటర్ల పరుగును స్ప్రింట్‌ తరహాలో పరుగెత్తినా, ఫినిష్‌ లైన్‌ వద్ద తన ఛాతీ భాగాన్ని ముందుకు వంచడంలో విఫలం కావడంతో ‘ఫోటో ఫినిష్‌’లో నాలుగో స్థానమే దక్కింది. ‘అది నా అత్యుత్తమ ప్రదర్శన. అతి స్వల్ప తేడాతో నేను ఒలింపిక్స్‌ పతకం కోల్పోయానంటే నమ్మలేకపోతున్నాను. ఆ రేస్‌ తర్వాత చాలా ఏడ్చేశాను’ అని ఉష తర్వాత చెప్పుకుంది. 

చెరగని రికార్డు 
1985లో జకార్తాలో జరిగిన ఆసియా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఉష ఏకంగా ఐదు స్వర్ణాలు (100మీ., 200మీ., 400మీ., 400మీ.హర్డిల్స్, 4X400మీ. రిలే) గెలుచుకుంది. ఒకే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళగా ఉష రికార్డు నమోదు చేసింది. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగానే ఉండటం విశేషం. 

- మహమ్మద్‌ అబ్దుల్‌ హాది

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top