Team India: మరో కీలక మార్పు.. తెర మీదకు ప్రఖ్యాత బ్రాండ్‌ పేరు! డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచే..

Another Big Change In Indian Cricket Is New Jersey Sponsor Adidas - Sakshi

Team India New Jersey: టీమిండియా జెర్సీ మరోసారి మారబోతోందా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ప్రఖ్యాత యూరోప్‌ బ్రాం‍డ్‌ అడిడాస్‌ రూపొందించనున్న జెర్సీల్లో భారత ఆటగాళ్లు త్వరలోనే దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపాయి.

కాగా 2016- 2020 మధ్య కాలంలో నైకీ టీమిండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల కాలానికి గానూ ఎంపీఎల్‌ స్పోర్ట్స్(మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌) 370 కోట్ల రూపాయల భారీ ఒప్పందంతో టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే, గతేడాది డిసెంబరులో తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్‌ బీసీసీఐని కోరింది.

మార్చి వరకు ఒప్పందం ఉన్న నేపథ్యంలో.. కేవల్‌ కిరణ్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌(కేకేసీఎల్‌) సీన్‌లోకి వచ్చింది. దీంతో.. శ్రీలంకతో సిరీస్‌నుంచి కేకేసీఎల్‌ తమ పాపులర్‌ బ్రాండ్‌ ‘కిల్లర్‌ జీన్స్‌’ లోగోను  ప్రదర్శించింది. అయితే, ఈ కేకేసీఎల్‌ ఒప్పందం పూర్తైన తర్వాత ప్రముఖ బ్రాండ్‌ అడిడాస్‌తో చేతులు కలిపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు న్యూస్‌18 వెల్లడించింది. ఈ క్రమంలో జూన్‌ 1 నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో జూన్‌ 7 నుంచి జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో రోహిత్‌ సేన అడిడాస్‌ జెర్సీలో కనిపించనున్నట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ సహా ఇంగ్లండ్‌ ‍క్రికెట్‌ టీమ్‌కు అడిడాస్‌ జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది.

అంతేగాక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌లతో అడిడాస్‌కు గతంలో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాటింగ్‌హాంషైర్‌, సౌత్‌ ఈస్ట్‌ స్టార్స్‌, సర్రే జట్లకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్‌.. త్వరలోనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా మారనున్నట్లు సమాచారం.

చదవండి: Steve Smith: గిల్‌కు అంత సీన్‌ లేదు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించబోయేది అతడే..!
IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top