ఇది అవుటా? నాటౌటా? పాపం రఘువంశీ | Angkrish Raghuvanshi Run Out Controversy In IPL 2026 KKR Vs LSG, Was It Out Or Not Out? Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: ఇది అవుటా? నాటౌటా? పాపం రఘువంశీ

Apr 26 2026 9:05 PM | Updated on Apr 27 2026 3:21 PM

Angkrish Raghuvanshi run-out controversy: Was it out or not out?

ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీని దురదృష్టం వెంటాడింది. క్రికెట్‌లో అరుదుగా కన్పించే 'అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' (ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం) నిబంధన ప్రకారం రఘువంశీ ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔటైన నాలుగో బ్యాటర్‌గా రఘువంశీ నిలిచాడు.

ఏమి జరిగిందంటే?
కోల్‌కతా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మ‌హ్మ‌ద్ ష‌మీ బంతిని వేగంగా అందుకోవ‌డంతో.. ర‌ఘువంశీ స‌గం దూరం వెళ్ళాక మళ్ళీ వెన‌క్కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు.

అయితే వెన‌క్కి వెళ్లే క్ర‌మంలో ష‌మీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనుక్కి పరిగెత్తాడని పంత్ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్‌ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు.

దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్  కింద అవుట్‌గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై రఘువంశీతో పాటు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, మెంటార్లు షేన్ వాట్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రఘువంశీ మైదానాన్ని వీడే క్రమంలో తన బ్యాట్‌ను, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడు క్రీజులోకి చేరుకోవాలనే ఉద్దేశంతోనే అలా పరిగెత్తాడని, అలా ఎలా ఔట్ ఇస్తారని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో యూజర్ రూల్స్ ప్రకారం ఇది అవుటేనని కామెంట్ చేశాడు.
 


 

 

Advertisement
 
Advertisement
Advertisement