
మహిళల వన్డే ప్రపంచకప్‌పై అలీసా హీలీ వ్యాఖ్య
బ్రిస్బేన్: భారత్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో స్పిన్ సవాలు ఎదురవడం ఖాయమని ఆ్రస్టేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ పేర్కొంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్‌కప్ టైటిల్ గెలుచుకున్న ఆ్రస్టేలియా జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అదే తీవ్రత కొనసాగించాలని భావిస్తున్నట్లు హీలీ వెల్లడించింది.
భారత మహిళల ‘ఎ’ జట్టుతో మూడో వన్డేలో హీలీ అజేయ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హీలీ మాట్లాడుతూ... భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెలలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడించింది. ‘భారత్ ‘ఎ’ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరల్డ్‌కప్‌లో మాకు మరింత స్పిన్ సవాలు ఎదురుకానుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కీలకం’ అని హీలీ పేర్కొంది.
ఆ్రస్టేలియా ‘ఎ’తో వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు తరఫున రాధ యాదవ్, మిన్ను మణి, తనూజ కన్వర్, ప్రేమ రావత్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హీలీ... రెండో వన్డేలో 91 పరుగులతో సెంచరీ చేజార్చుకుంది. ఇక ఆదివారం జరిగిన సిరీస్ చివరి వన్డేలో 85 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 137 పరుగులు చేసి ఫామ్ చాటుకుంది.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హీలీ సత్తాచాటడం ఆ్రస్టేలియా జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు కోచ్ డాన్ మార్‡్ష అన్నాడు. ‘భారత్‌లో వన్డే ప్రపంచకప్ వంటి మెగాటోర్నీకి ముందు అలీసాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. భారత ‘ఎ’ జట్టుతో టి20, వన్డే సిరీస్‌లతో హీలీ చక్కటి ప్రదర్శన కనబర్చింది. చివరి వన్డేలో సాధించిన అజేయ శతకం మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అని మార్‡్ష పేర్కొన్నాడు.