సెంచరీ‌తో మెరిసిన కెప్టెన్‌‌ అజింక్యా రహానే

Ajinkya Rahane Made 12th Hundred In Test Career In Boxing Day Test - Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ అజింక్యా రహానే సెంచరీతో అదరగొట్టాడు.195 బంతులాడి 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్టు కెరీర్‌లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానే 104, జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : 'గెట్‌ అవుట్‌ మ్యాన్‌' అంటూ పాక్‌ క్రికెటర్ అసహనం‌) 

కాగా 36/1  ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్‌ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్‌ కీపర్‌ పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే 17 పరుగులు చేసిన చతేశ్వర్‌ పుజారా కూడా కమిన్స్‌ బౌలింగ్‌లో పైన్‌ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాల్సి వచ్చింది .దీంతో టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే మరోవికెట్‌ పడకుండా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద లంచ్‌ విరామానికి వెళ్లారు.

లంచ్‌ అనంతరం 21 పరుగులు చేసిన హనుమ విహారి లయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పంత్‌ రహానేకు సహకరిస్తూ మంచి టచ్‌లో కనిపించినా.. 29 పరుగులు చేసి స్టార్క్‌ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 173 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పయింది. టీ విరామం అనంతరం మ్యాచ్‌కు కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్‌ ప్రారంభం కాగా రహానే, జడేజా మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, స్టార్క్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. లయన్‌ 1 వికెట్‌ తీశాడు.(చదవండి : రహానే కెప్టెన్సీ భేష్‌..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top