 
													పాకిస్తాన్ మాజీ ఆటగాడు, బ్యాటింగ్ చిచ్చరపిడుగు షాహిద్ అఫ్రిది 46 ఏళ్ల వయసులోనూ రెచ్చిపోతున్నాడు. కుర్రాళ్లతో పోటీపడి మరీ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు.
చాలాకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది ప్రస్తుతం వారి దేశంలో జరుగుతున్న సింధ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.
Shahid Afridi is showing our power-hitters how it's done even in 2024 🇵🇰🔥🔥 pic.twitter.com/vu2lVZGjPU
— Farid Khan (@_FaridKhan) February 2, 2024
ఈ లీగ్‌లో బెనజీరాబాద్ లాల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. మీర్‌పూర్‌ఖాస్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో సుడిగాలి అర్ధశతకం (50) బాదాడు. అఫ్రిది ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అఫ్రిది ఈ స్థాయిలో రెచ్చిపోయినప్పటికీ అతని జట్టు ఓటమిపాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్రిది టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అఫ్రిదితో పాటు షోయబ్ మక్సూద్ (57) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్ధి జట్టు కేవలం 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
ఓపెనర్ ఉమర్ ఆమిన్ 37 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలువగా.. వన్‌డౌన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ 20 బంతుల్లో 50 పరగులు చేశారు. వీరిద్దరూ అఫ్రిది టీమ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఆమిన్ 6 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడగా.. అక్రమ్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అఫ్రిది బౌలింగ్ వేయలేదు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
