రాణించిన రహ్మానుల్లా గుర్బాజ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

Afghanistan Scored Huge Score In Third T20I Vs Sri Lanka - Sakshi

శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారీ స్కోర్‌ చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్‌ (43 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్‌) రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్‌ జట్టు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌ సాధించడంలో అజ్ముతుల్లా ఒమర్‌జాయ్‌ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు) తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ 10, మొహమ్మద్‌ నబీ 16 నాటౌట్‌, మొహమ్మద్‌ ఇషాక్‌ 16 నాటౌట్‌ పరుగులు చేయగా.. కరీం జనత్‌ డకౌటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరణ, అఖిల ధనంజయ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్‌ వనిందు హసరంగ ఓ వికెట్‌ దక్కించకున్నాడు.

ఏంజెలో మాథ్యూస్‌ (2-0-21-0), నువాన్‌ తుషార (4-0-48-0) భారీగా పరుగులు సమర్పించుకోగా.. దసున్‌ షనక (2-0-16-0) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక 2-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌.. శ్రీలంక పర్యటనలో టెస్ట్‌, వన్డే సిరీస్‌ ఆడింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ పర్యటన ఆఫ్ఘనిస్తాన్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. మూడో టీ20లో భారీ స్కోర్‌ చేయడంతో విజయావకాశాలు ఉన్నాయి.

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top