
బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ వైటావాష్‌కు అఫ్గానిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ను 81 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే అఫ్గాన్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు 44.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(140 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 95) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు నబీ(22), ఘజన్‌ఫర్(22) పర్వాలేదన్పించారు.
మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. టాంజిమ్ హసన్ షకీబ్, రిషాద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.
రషీద్ మయాజాలం..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. స్పిన్నర్ రషీద్ ఖాన్ ధాటికి విల్లవిల్లాడింది. బంగ్లాదేశ్ 28.3 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. 8.3 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
అతడితో ఒమర్జాయ్ మూడు, ఖరోటీ ఒక్క వికెట్ సాధించారు. బ్యాటింగ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన జద్రాన్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే అక్టోబర్ 14న అబుదాబి వేదికగా జరగనుంది.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా