
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నమీబియా చేతిలో టీ20 వరల్డ్‌కప్-2024 రన్నరప్ సౌతాఫ్రికాకు ఘోర పరాభావం ఎదురైంది. శనివారం విండ్‌హోక్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో నమీబియా ఓడించింది.
నమీబియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమ్వగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జేన్ గ్రీన్(30 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాది నమీబియా మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్రీన్.. చివరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
ఫలితంగా 135 పరుగుల లక్ష్యాన్ని నమీబియా 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఏ ఫార్మాట్‌లోనైనా సౌతాఫ్రికాపై నమీబియాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.నమీబియా బ్యాటర్లలో గ్రీన్‌తో పాటు గెర్హార్డ్ ఎరాస్మస్(21), కుర్గర్(18),ట్రంపెల్మాన్(11) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్, సీమ్‌లైన్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఫోర్టిన్, కోయిట్జీ చెరో వికెట్ సాధించారు.
తేలిపోయిన ప్రోటీస్ బ్యాటర్లు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగొచ్చిన క్వింటన్ డికాక్(1) తీవ్ర నిరాశపరిచాడు. అతడితో పాటు స్టార్ బ్యాటర్లు రీజా హెండ్రిక్స్(7), ఫెరీరా(4) విఫలమయ్యారు.
సఫారీ బ్యాటర్లలో జే స్మిత్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెర్మన్(23), ఫోర్టిన్(19) పర్వాలేదన్పించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ మూడు, మాక్స్ హీంగో రెండు, ఎరాస్మస్, షికాంగో, స్మిత్ తలా వికెట్ సాధించారు. నమీబియా ఇటీవలే టీ20 ప్రపంచకప్-2026కు ఆర్హత సాధించింది. కాగా ఓ అసోసియేట్ సభ్య దేశం చేతిలో సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
చదవండి: నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా